సాక్షి, విజయవాడ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావుకు బూతు సాహిత్య అకాడమీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయం కోసం కేసీఆర్ దొర కులాల వారీగా వరాలు కురిపిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన వీహెచ్... ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు అంటూ వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఓట్ల చీలిక కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ ఆయన ప్రయత్నాలు ఫలించవని జోస్యం చెప్పారు. సీఎం తనయుడు కేటీఆర్ ఎక్కడ చదివారో తెలియదు కానీ, ఆయన పెరిగింది మాత్రం గల్లీలోనేనని వీహెచ్ ఎద్దేవా చేశారు. జనవరి 26న పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కేటీఆర్‌కు బూతు సాహిత్య అవార్డు ఇవ్వాలంటూ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధించారు.
ఏపీకి హోదా బిల్లు పెట్టిన రోజు ఆమె సభకు రాలేదు..
ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని చెప్పిన ఎంపీ కవిత.. బిల్లు ప్రవేశపెట్టిన రోజున సభకు హాజరవ్వలేదని వీహెచ్ అన్నారు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ముందే చెప్పారని, రెండు రాష్ట్రాలకు సమన్యాం చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న కొందరు నాయకులు మాత్రం తెలంగాణ రానివ్వమంటూ అడ్డుపడ్డారన్నారు. మండలి కమిషన్ వేసి ఏళ్లు గడుస్తున్నా బీసీలకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment