సాక్షి, గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత విజయ్ రూపానీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత విధేయుడైన విజయ్ రూపానీ రెండోసారీ గుజరాత్ సీఎంగా, డిప్యూటీ సీఎంగా నితిన్ భాయ్ పటేల్ రేపు (డిసెంబర్ 26న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ భారీ ఈవెంట్‌కు హాజరు అవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గత శుక్రవారం గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం రూపానీని తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసన సభ్యుల భేటీలో శాసనసభా పక్ష నేతగా రూపానీని, ఉప నేతగా నితిన్ పటేల్‌ను ఎన్నుకున్నారు.
ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినా వరుసగా ఆరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ 99 సీట్లతో 1995 అనంతరం తొలిసారి అతి తక్కువ స్థానాలు సాధించింది. మూడంకెల సీట్లు సాధించలేకపోయామని భావిస్తోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్ రాథోడ్ మద్దతు పలకడంతో సెంచరీ మార్కు దాటినట్లైంది. కాగా, మూడు దశాబ్దాల అనంతరం మొదటిసారి కాంగ్రెస్ 77 స్థానాల్ని సొంతం చేసుకుంది. మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించి అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment