సాక్షి, హైదరాబాద్ : జనసేన, కేఏ పాల్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరికి ఓటేసినా చంద్రబాబుకు వేసినట్టేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి చంద్రబాబు ఇచ్చిన నిధులతోనే పవన్ కల్యాణ్, పాల్‌లు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ పార్టీల అభ్యర్థుల జాబితాను చంద్రబాబే ఫైనల్ చేశాడన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్ వైపే ఉన్నా.. చతుర్ముఖ పోటీ ఉండేలా గుంట నక్క స్కెచ్ వేశాడని మండిపడ్డారు. బుధవారం ట్విటర్ వేదికగా చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, కేఏ పాల్, పచ్చమీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
‘కొందరు బందిపోట్లు ఖజానా దోచుకుని అడవిలో పాతిపెట్టారట. మ్యాపులో గుర్తులను గీసి తలా ఒక ముక్క తీసుకుని విడిపోయారట. దాచిన సొత్తు కోసం ఒకరికి తెలియకుండా ఇంకొకరు వెతుకుతున్నారు. చివరికి ప్రజల చేతికి చిక్కారు. ప్యాకేజి పార్టనర్ పావలా, పాల్, కాంగ్రెస్, కులమీడియానే ఈ బందిపోట్లు.’ అని వ్యంగాస్త్రాలు సంధించారు.
గాడిద పళ్లు తోమారా?
‘రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచిపోయిందని, 60 నెలల్లో ఏపిని దేశంలోనే నెం.1 గా చేస్తానన్నారు. విభజన గాయాలు మానలేదు. కట్టుబట్టలతో వచ్చాం అని మళ్లీ సంతాప తీర్మానాలు చేస్తున్నారు. ఐదేళ్లు గాడిద పళ్లు తోమారా చంద్రబాబూ? పంచభూతాలను దోచుకుతినడం తప్ప ప్రజల గురించి ఏనాడైనా ఆలోచించారా?’ అని నిలదీశారు.
అది సరిపోదు కులమీడియా దళారీ..
‘రాధాకృష్ణ రోజుకో దొంగ సర్వే ప్రచురించి చంద్రబాబు గెలుస్తున్నాడని జాకీ పెట్టి తెగ హైరానా పడుతున్నాడు. ఒక్క జాకీ సరిపోదు కులమీడియా దళారీ. నాలుగు టైర్లూ ఫ్లాట్ అయ్యాయి. పచ్చ మీడియా జాకీలు, క్రేన్లు అన్నీ కలిపినా చతికల పడ్డ బాబును నిల్చోబెట్టలేరు. పాపం వయసై పోయింది కదా?’ అని సెటైర్లు వేశారు.
ట్రంపు మీద పోరాటం తర్వాత..
‘కర్నాటక మఖ్యమంత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను ప్రచారానికి రప్పించారు. ఆల్మట్టి ఎత్తు పెంచేది లేదు. తుంగభద్ర కాలువల నుంచి జలదోపిడీ జరగకుండా చేసి కర్నూలు, కడప, అనంతపురాలను బీళ్లు కాకుండా చూస్తామని ఓ హామీ తీసుకోలేక పోయారా? చంద్రబాబూ. ట్రంపు మీద పోరాటం తర్వాత చేద్దురుగాని.’ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment