సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఏనాడు గిట్టుబాటు ధర రాలేదని, దళారులే రాజ్యం ఏలారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం ధాన్యం క్వింటాకు రూ.1835కు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరసు ట్వీట్లు చేశారు.
‘బాబు ఐదేళ్ల పాలనలో రైతులకు ఏనాడు గిట్టుబాటు ధర రాలేదు. దళారులదే రాజ్యంగా ఉండేది. ఇపుడు ధాన్యం క్వింటా 1835కు ప్రభుత్వమే కొంటోంది. సిఎం జగన్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నూకల పేరుతో కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేసిన మాఫియా ఆటలు సాగవు. అర్థమవుతోందా బాబూ?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘ఎలక్షన్ల ముందు ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్షలకు తగలేసిన రూ.4 వేల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడితే జిల్లాకో వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్ ఏర్పాటయ్యేది. పచ్చ మీడియాను మేపడం, ప్రజాధనంతో సొంత ప్రచారం కోసం వేల కోట్లు వృథా చేసి ఇప్పుడు ఉచిత సలహాలిస్తున్నాడు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘సామాజిక దూరం పాటించాలి. ఇళ్లలో స్వీయ నిర్బంధంలో ఉంటే తప్ప కరోనాను నియంత్రించలేం. మహారాష్ట్రలో కరోనా మూడో స్టేజికి వెళ్లినట్టు అక్కడ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరినీ కలవకున్నా వ్యాధి సోకినట్టు గుర్తించారు. మనకు ఆలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment