సాక్షి, అమరావతి : ‘ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా?’ అని టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేశ్‌ను వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చేయడంపై మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశపడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకుతిన్నది బయట పడిందనా..? ఈ ఏడుపులు..? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా?’ అని ఎద్దేవా చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకుల డ్రామాలపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
‘ఎవరు సలహా ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు చంద్రబాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటికొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయ నేతలెవరైనా గెలిచినా, ఓడినా ప్రజల మధ్యన ఉండాలనుకుంటారని, చంద్రబాబు మాత్రం కాలు బయట పెట్టడానికి జంకుతున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలిచ్చిన దిమ్మతిరిగే షాక్ నుంచి తేరుకోలేదో.. లేక వాళ్ల మీద అలిగారో.. లేకుంటే లింగమనేని ఎస్టేట్ ఉంటుందో పోతుందో అన్న కొత్త టెన్షన్ చంద్రబాబుకు మొదలైందోనని ఎద్దేవా చేశారు. ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు చంద్రబాబు డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారన్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా? అని చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment