‘అక్కడ 9700 ఓట్లు లెక్కించలేదు’ | Vijaya Sai Reddy Tweet About Guntur Parliament Result | Sakshi
Sakshi News home page

‘9700 ఓట్లు లెక్కించలేదు.. న్యాయ పోరాటం చేస్తాం’

Published Tue, May 28 2019 1:34 PM | Last Updated on Tue, May 28 2019 6:53 PM

Vijaya Sai Reddy Tweet About Guntur Parliament Result - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్‌ అధికారి పక్షపాతం ప్రదర్శించారని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదని ఆయన ట్వీటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్వో అక్రమానికి పాల్పడి టీడీపీ 4200 ఓట్లతో గెల్చినట్టు ప్రకటించారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గుంటూరు లోక్‌సభ స్థానంలోని సుమారు 9,700 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లున్న కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడంతో వాటిని లెక్కించని విషయం తెలిసిందే.

ఈ లోక్‌సభ పరిధిలో ఉన్న తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, ఉత్తర గుంటూరు, దక్షిణ గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క దక్షిణ గుంటూరు మినహా అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. కానీ లోక్‌సభ స్థానంలో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి కాకుండా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ను విజయం వరించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకుండానే రిటర్నింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారని వైఎస్సార్‌సీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

గుంటూరుతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానంలోనూ అధికారుల తీరుతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఓడిపోవాల్సి వచ్చిందని, ఈ రెండు స్థానాలపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం సిట్టింగ్‌ ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, టెక్కలి సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement