
ఇటువంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు పెద్ద మనసు కనబర్చాలి
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను కరోనా ఆస్పత్రికి ఇచ్చి చంద్రబాబు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆయన వరస ట్వీట్లు చేశారు. ‘హైదరాబాద్ లో ఖాళీగా పడున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కరోనా హాస్పిటల్ కు ఇస్తే తెలంగాణా ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందని బాబుకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలి. పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుంది’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
(చదవండి : రాజకీయ దుర్బుద్ధి తప్ప.. ప్రజలపై ప్రేమ ఏదీ!)
‘బాబు పబ్లిసిటీ స్టంట్ల కైపులో మునిగి తేలిన టీడీపీ నేతలు, జగన్ గారు ఎటూ వెళ్లరా అని శోకాలు పెడుతున్నారు. అతనికి టాబ్లెట్ వేయండి, ఇతనికి టెంపరేచర్ చూడండి అని బాబులా డ్రామాలాడాలట! ప్రభుత్వ యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేస్తోంది. సిఎం గారు పర్యవేక్షిస్తున్నారు. కనిపించడం లేదా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘కేంద్రానికి తానే లేఖా రాయలేదని నిమ్మగడ్డ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లేటప్పటికి కాదు నేనే రాశా అన్నాడు. లెటర్ బయటి నుంచి వచ్చిందని సిఐడి ప్రాథమికంగా నిర్థారించింది. 35 ఏళ్లు సివిల్ సర్వెంట్ గా చేసిన వ్యక్తి ఎవరి చేతిలో పావుగా మారాడో గ్రహించాలి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.