సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆదివారం లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ప్రజావేదిక ద్వారా పార్టీ కార్యక‍్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజావేదికలో ఎమ్మెల్యేలను పిలిచి టెలీ కాన్ఫరెన్స్‌లు, పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు ఈసీ అనుమతితో చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తమకు తెలియదని, ఈ విషయంపై సీఈసీ వెంటనే జోక‍్యం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు.
కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ భవనాలను పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించకూడదని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఉండవల్లిలో తన అధికారిక నివాసం పక్కనే నిర్మించిన ప్రజావేదికను ఆయన పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన మాత్రం కించిత్ కూడా లెక్క చేయడంలేదు. తాజాగా సోమవారం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో అక్కడే సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, గెలుపు అవకాశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేందుకు ఉపయోగించాల్సిన ప్రజావేదికలో ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారనే దానికి టీడీపీ నేతల నుంచి సమాధానం కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment