పార్లమెంట్ భవనంపై ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి గురువారం పార్లమెంట్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హోదా సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని విజయసాయి రెడ్డి కోరారు.
విజ్ఞులు ఎవరూ బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వరు
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం నాది అని చెప్పకునే చంద్రబాబు... 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వాపోవడం ఆయనకు క్రెడిబులిటీ, క్యారెక్టర్ లేదనడానికి నిదర్శనం అని విజయసాయి రెడ్డి విమర్శించారు. బాబు లాంటి అవినీతిపరులకు విజ్ఞానవంతులు ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వరని విమర్శించారు. బాబులాగా తాను అవినీతికి పాల్పడటం లేదని స్పష్టం చేశారు. ‘ఓటుకు కోట్లు కేసు గురించి తప్పించమని కోరడానికే ప్రధానిని బాబు అపాయింట్‌మెంట్ కోరారు. అందుకే మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేద’ని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ఏనాడూ ప్రజల సమస్యలు కేంద్రం దృష్టి తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment