
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి ఇప్పుడు వివాదాన్ని రాజేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 23 సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోనియాకు స్వాగతం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఓ ఫ్లెక్సి ఏర్పాటు చేసింది. కానీ దీనిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేదు. దాంతో ఇతరులను విమర్శించే ముందు మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మహిళా మంత్రి కూడా లేదంటూ టీఆర్‌ఎస్‌ని విమర్శించే మనం ఇప్పుడు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలో ఒక్క మహిళా నాయకురాలి ఫోటో కూడా లేకపోవడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. చెప్పడానికే నీతులు పాటించడానికి కావా అంటూ జనాలు విమర్శిస్తున్నారని అన్నారు. ఈ సభలో మగవాళ్లు మాత్రమే ఉంటారా.. మహిళలు కూడా సభకు హాజరవుతారు కదా అంటూ విజయశాంతి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సొంత పార్టీ నేతలనే విమర్శిస్తూ రాములమ్మ ఇలా మాట్లాడటం పట్ల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment