
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల యుద్దానికి తమ పార్టీ సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, మాజీ ఎంపీ విజయశాంతి తెలిపారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం విజయశాంతి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శుత్రవులతో యుద్దానికి సిద్దమవుతున్నామని, శత్రువును ఓడగొట్టి ప్రజలకు మేలు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనను దేవుడిచ్చిన చెల్లి అన్నారని, ఈ అన్నా, చెల్లెల మధ్య పోరాటానికి ప్రజలే తీర్పు చెబుతారన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పజెప్పిన తమ అధినేత రాహుల్ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చానని, తన గురించి తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, దాసోజు శ్రవణ్ కుమార్‌లు పాల్గొన్నారు.
దొరలు, ప్రజలకు జరిగే ఎన్నికలు : భట్టి
వచ్చే ఎన్నికలు దొరలకు, ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క తెలిపారు. ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్ర ఫలాలు.. సామాన్యులకు అందడం లేదన్నారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ దోపిడీకి గురయ్యిందని తెలిపారు. ప్రజా గాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్కలను తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రజల ప్రభుత్వం ఏర్పాటుకు అందరిని కలుపుకొని పోతామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం స్వేచ్ఛ , భావవ్యక్తీకరణ, స్వాతంత్ర్యం లేదన్నారు. బస్సు యాత్రలు, సభలు, రోడ్ షోలకు సబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేసింది: డీకే అరుణ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ప్రచార సభలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ బానిసత్వం నుంచి విముక్తి కల్పించడానికి పోరాడుతామన్నారు. అందరం ఏకమై టీఆర్‌ఎస్ గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment