సాక్షి, అమరావతి : గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని మాజీమంత్రి నారాలోకేశ్‌కు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ పక్షనేత విజయసాయి రెడ్డి సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ.. ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలని చురకలింటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్‌పై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
బాబూ.. నో టెన్షన్
‘రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హతేమీ కాదు చంద్రబాబు గారూ. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఈ 40 ఏళ్ళలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారు. రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నారు. భావితరాలకు మీ చరిత్ర మీరు అలానే గుర్తుండిపోతుంది. మూడేళ్లలో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా మీరు తెచ్చుకున్న పేరు అలాగే ఉంటుంది టెన్షన్ పడకండి. ఆ రికార్డు మీకే సొంతం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి పనికి రోజువారి పురోగతి ఉంటుంది. చూస్తారుగా అప్పుడే తొందరెందుకు?. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి?’ అని విజయసాయి రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment