సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ నేతల దాడికి గురైన దళిత మహిళను ఆదివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర జెర్రిపోతులవారిపాలెం ద్వారా వెళ్లేలా చూస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తనయుడు అప్పలనాయుడు దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ చెప్పినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు అప్పలనాయుడులను ఏ1, ఏ2లుగా చేరుస్తూ వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ముదపాకలోని ఎస్సీ భూములను కూడా కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బండారు యత్నించినట్లు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయడమే దళితులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జెర్రిపోతులవారిపాలెం ఘటనలో దళిత మహిళలకు రూ.8 లక్షల పరిహారం ఇవ్వాల్సివుండగా.. ఒకరికి రూ. లక్ష, మరొకరికి రూ.25 మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి పట్టా ఇవ్వకుండా పొజిషన్ సర్టిఫికెట్‌ను మాత్రమే అందజేశారని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని చేశారు.
దళిత కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి వెంట వైఎస్‌ఆర్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, మల్లా విజయప్రసాద్, సైనాల విజయ్‌కుమార్, వరుదు కల్యాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment