
కార్యకర్తలతో వివేక్
సాక్షి, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి తీరుపై పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానంద ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు తనకు టికెట్ ఇస్తానని చెప్పి, నమ్మించి గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పని చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పెద్దపల్లి పార్లమెంటులో టీఆర్‌ఎస్ పార్టీకి జీవం పోసింది తానేనన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని, తనపై బురద చల్లి టికెట్ ఇవ్వకుండా నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌నుంచి బయటికి రావడంతో బానిసత్వం నుంచి స్వేచ్ఛ వచ్చినట్లు ఉందన్నారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఎస్‌సీఐ నిర్మాణం కోసం కేంద్రంతో మాట్లాడి 10 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయించానని చెప్పారు. పెద్దపల్లి జిల్లాకు తన తండ్రి పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వమని అడగలేదని.. వాళ్లే ఇస్తామన్నారని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమకారునికి టికెట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి టికెట్ ఇస్తామంటున్నారని, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.