
వీఆర్‌ఓలు ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు వస్తున్న దృశ్యం
ఒంగోలు టౌన్: ‘వీఆర్‌ఓలు లేకుండా శిస్తు కట్టించలేరు.. పోస్టుమార్టం చేయించలేరు. వీఆర్‌ఓలు లేకుండా తహసీల్దార్లు గ్రామాల్లోకి అడుగుపెట్టలేరు. ఇలా రెవెన్యూ ఇమేజ్ పెంచుతున్న వీఆర్‌ఓలకు మాత్రం పదోన్నతులు ఇవ్వరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే వారు చేసే ఆందోళనా కార్యక్రమాల్లో ఏపీ జేఏసీ అండగా నిలుస్తుంది’ అని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏపీవీఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
తొలుత స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన వారు ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్లుగా పదోన్నతులు పొందుతుంటే, వీఆర్‌ఓలు మాత్రం అదే పోస్టులో ఉద్యోగ విరమణ చేయడం దారుణమన్నారు. రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ పేరుతో వీఆర్‌ఓలను వాడుకొని అవమానించి బయటకు పంపడం క్షమించరాని నేరమని బొప్పరాజు వెంకటేశ్వర్లును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ అండగా నిలిచి పెద్దన్న పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు.
పదోన్నతులు కల్పిస్తే నష్టమా?
ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె. శరత్‌బాబు మాట్లాడుతూ రెవెన్యూ కాన్‌ఫెడరేషన్ పేరుతో వీఆర్‌ఓలను అణగదొక్కారని విమర్శించారు. వీఆర్‌ఓలకు పదోన్నతులు కల్పిస్తే కాన్‌ఫెడరేషన్‌కు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 10 లోపు వీఆర్‌ఓల పదోన్నతుల సమస్యను పరిష్కరించకుంటే వారు చేపట్టే ఆందోళనలో తాము పాల్గొంటామన్నారు. వీఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణరావు మాట్లాడుతూ మీ పంట, మీ సేవ, మీ ఇంటికి మీ భూమి, రైతు సేవలో రెవెన్యూశాఖ వంటి కార్యక్రమాల పేరుతో వీఆర్‌ఓలతో వేలకు వేలు ఖర్చు చేయించారన్నారు. అనుభవంలేని వారిని సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ వీఆర్‌ఓల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారన్నారు. వీఆర్‌ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి. రాము మాట్లాడుతూ అర్హులైన వారికి పదోన్నతులు రాకుండా తమ సోదర సంఘం అడ్డుపడుతూ వచ్చిందన్నారు.
అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వైపీ రంగయ్య మాట్లాడుతూ మేం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా అని ప్రశ్నించారు. ఈనెల 10వ తేదీ సీసీఎల్‌ఏను ముట్టడిస్తామని, అప్పటికి న్యాయం జరగకుంటే మూకుమ్మడి సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ధర్నాలో అసోసియేట్ ప్రెసిడెంట్ వీ మనోహర్‌రెడ్డి, విద్యాశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు ఏ స్వాములు, సర్వేయర్ల సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్, వీఆర్‌ఏ అసోసియేషన్ నాయకులు బాలరంగయ్య, పి. వివేకానంద, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment