పీవీఎన్ మాధవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బుధవారం శాసనమండలిలో టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటే, ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.
టీడీపీ తప్పుడు రాతలు: ఎమ్మెల్సీ మాధవ్
‘టీడీపీ మాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటున్నారు ఎప్పుడు ఇవ్వలేదో చెప్పమనండి. ఎయిమ్స్ పనిజరగడం లేదని టీడీపీ అధికార వెబ్‌సైట్‌లో తప్పుడు రాతలు రాస్తున్నారు. మంగళగిరి వెళ్లి పనులు పరిశీలించి మాట్లాడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బాకీ లేదు, బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. 2019 ఎన్నికల కోసం హడావుడిగా స్పిల్‌వే పనులు చేపట్టారు. నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. మేము అన్నీ నిజాలే చెబుతామ’ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
ఏపీపై కేంద్రం పోలీసింగ్: ఎమ్మెల్సీ డొక్కా
‘రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఇది రాజకీయ ధర్మమా, మిత్ర ధర్మమా? ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రతివిషయాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. అహ్మదాబాద్, ముంబై మెట్రోకు వేల కోట్లు కేటాయిస్తారు. అమరావతి మెట్రోకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పోలీసింగ్ చేస్తోంది. అభివృద్ధి ఎలా చేయాలో చంద్రబాబు నుంచి కేంద్రం నేర్చుకోవాలి. పార్లమెంటు చట్టాలంటే బీజేపీకి గౌరవం లేదు. ఐదుకోట్ల ఏపీ ప్రజలను నిర్లక్ష్యం చేయొద్దు. కేంద్రంపై పోరాటం చేసేవరకూ తెచ్చుకోవద్ద’ని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment