
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయవిచారణ జరపాలని టీఆర్‌ఎస్‌ఎల్పీ తరుఫున డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ హత్యకు కారకులు ఎవరో తేలాలంటే గత కొంతకాలంగా హత్యకు గురైన శ్రీనివాస్ ఎవరితో మాట్లాడారో చూడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడు రాంబాబు కూడా కోమటిరెడ్డికి శిష్యుడేనని టీఆర్‌ఎస్ పేర్కొంది.
ఈ కేసులో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని పేర్కొంది. నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన సంచలనం రేపింది. హత్య కేసులో ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్‌లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అయితే, వీరి వెనుక అధికార పార్టీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు విచారణ జాగ్రత్తగా చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, పొంగులేటి, వీహెచ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment