
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. గాంధీభవన్‌లోని ఇందిరా భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ పూర్వ నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి బహుమతి ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అప్రజాస్వామిక పాలన నడుస్తోందని విమర్శించారు. ఈ కుటుంబ పాలనకు ముగింపు పలికి.. ఇందిరమ్మ సంక్షేమ రాజ్యాన్ని తెచ్చుకోవాలన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని భట్టి అన్నారు. మనలో ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టాలని చెప్పారు. మనందరం కాంగ్రెస్ కుటుంబమన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుల శ్రమ, కృషి, పట్టుదల.. వల్లే పార్టీ బలోపేతం అవుతోందని తెలిపారు. కేసీఆర్ పాలనపై.. కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రతో దండయాత్ర మొదలుపెట్టిందని భట్టి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment