
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి తనను ఎన్నుకున్నందుకు సీతారాం ఏచూరి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయని అన్నారు. శ్రామిక కార్మిక పాలన తీసుకురావడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. దేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఓటమే మన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి (65) మరోదఫా ఎన్నికైన సంగతి తెలిసిందే. 22వ జాతీయ మహాసభల్లో భాగంగా చివరిరోజు(ఆదివారం) జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.
అనంతరం సీతారాం ఏచూరి మహాసభల్లో మాట్లాడారు. దోపిడీలేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెను సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు. దేశ ప్రజల విముక్తే మన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. లక్ష సాధనకు పునరంకితం అవుదామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment