సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి(కుడి)
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 26 రాష్ట్రాల్లో 55 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. సురవరం గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా చేశామని వెల్లడించారు. గత పార్లమెంటులో ప్రజల కోసం శక్తివంతమైన గొంతును వినిపించామని పేర్కొన్నారు. వామపక్షాలను గెలిపిస్తే ప్రజలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో మా బలం ఉపయోగపడుతుందని చెప్పారు. బీజేపీ, ఎన్‌డీయే పార్టీలను చిత్తుగా ఓడించాలని సీపీఐ పిలుపునిస్తోందని వ్యాక్యానించారు.
పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. కశ్మీర్‌లో పార్లమెంటు ఎన్నికలు జరపగలిగినపుడు, అసెంబ్లీ ఎన్నికలు జరపడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన స్థానాల్లో వీవీ ప్యాట్లు లెక్కపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్‌కి మద్ధతు పలుకుతున్నాయని మోదీ చేస్తోన్న అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తోన్నామని అన్నారు.
ప్రతిపక్షాలను మాకసికంగా దెబ్బతీయడం కోసమే: చాడ
తెలంగాణ రాష్ట్రం ఫిరాయింపుల తెలంగాణాగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా కేసీఆర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేయాలని భావించామని, మా రాష్ట్ర కమిటీలతో చర్చించి పూర్తి విషయాలను వెల్లడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment