ఊపిరున్నంత వరకూ పోరాడుదాం | We will fight till the last breath says YS Vijayamma | Sakshi
Sakshi News home page

ఊపిరున్నంత వరకూ పోరాడుదాం

Published Mon, Apr 9 2018 1:26 AM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM

We will fight till the last breath says YS Vijayamma - Sakshi

ఎంపీలను పరామర్శిస్తున్న వైఎస్‌ విజయమ్మ

న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం అంతా కలసి ఊపిరి ఉన్నంత వరకూ పోరాడుదామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ భవన్‌ వద్ద మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలను పరామర్శించి, సంఘీభావం ప్రక టించడానికి ఆమె ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో ఉన్నందువల్ల ఆయ న ప్రతినిధిగా ఆమె ఎంపీలను పరామర్శించారు.

అనంతరం దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విజయమ్మ ఏం చెప్పారంటే... ‘‘హోదా ఏపీ ప్రజల హక్కు. ఆ హక్కును త్వరగా ప్రకటించాలని ఢిల్లీ పెద్దలను కోరు తున్నా. ఏపీలో నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబం నమ్మకానికి ప్రతిబింబం లాంటిది. ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇప్పటిదాకా అన్ని ప్రయత్నాలూ చేసింది. జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా ఆమరణ దీక్షకు పూనుకు న్నారు. రాష్ట్రంలో యువభేరీలు నిర్వహించి, హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ పోరాటంలో భాగంగా మా పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. 13 రోజులు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే, ఒక్క రోజు కూడా వాటిపై చర్చించలేదు. ఇక అంతిమంగా ఎంపీలు రాజీనామాలు చేసి, అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.  

న్యాయం పాండవుల పక్షానే..
మా ఎంపీలు ఐదుగురే అయినా వారు పంచ పాండవుల్లాంటి వారు. పాండవుల పక్షాన న్యాయం ఉంది. ఉమ్మడి ఏపీని కాంగ్రెస్‌ పార్టీ ఓ ఆట వస్తువుగా చేసింది. సమైక్యంగా ఉంటే జగన్‌ అధికారంలోకి వస్తాడనే దుర్బుద్ధితో రాష్ట్రాన్ని విడగొట్టారు. కాంగ్రెస్, బీజేపీ కలసి విభజన చేశాయి. ఆరోజే ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపర్చి ఉంటే ఇప్పుడు ఇబ్బం దులుండేవే కావు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు.  

ప్రభుత్వానికి పెద్ద మనసు లేదు 
హోదా కావాలని మా పార్టీ గట్టిగా అడిగితే కొందరు ఎగతాళిగా మాట్లాడారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా.. హోదా ఏమైనా సంజీవనా.. అని ఎగతాళి చేశారు. అలాంటివారే ఇప్పుడు హోదా కావా లంటూ నాటకాలాడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ తొలినుంచీ హోదా రావాలని కోరు తోంది. హోదా వస్తుందనే నమ్మకం ఉంది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు ప్రాణాలర్పించి సాధించుకున్నారు. ఇవాళ జగన్‌ కూడా అదే అంటున్నారు. హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకూ పోరాడు దామని చెబుతున్నారు. మన ఎంపీలు ప్రాణాలకు తెగించి అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గతంలో ఎవరైనా దీక్షలు చేస్తే ప్రభుత్వానికి స్పందించే అలవాటు ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ కనిపించడం లేదు. ప్రభుత్వానికి పెద్ద మనసు లేదు. 

చంద్రబాబు నాలుగేళ్లలో ఏం చేశారు? 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏయే ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 90 శాతం నిర్మించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పూర్తిచేయలేకపోయారు. ఈ నాలుగేళ్లలో ఏయే పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం మనమంతా కలిసి పోరాడాలని జగన్‌ కోరుతున్నారు. దీనికోసం ఏ పార్టీతో అయినా కలుస్తానంటున్నారు. అది థర్డ్‌ ఫ్రంట్‌ గానీ, కాంగ్రెస్‌ గానీ, బీజేపీ గానీ, ఏదైనా సరే... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారితోనే కలుస్తామని జగన్‌ చెబుతున్నారు. 

25 మంది ఎంపీలూ కలిస్తే కదలిక వచ్చేది 
రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చేది. పెద్ద రాష్ట్రాలకు ఉండే విలువ కేంద్రంలో చిన్న రాష్ట్రాలకు ఉండదని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తరచూ చెప్పేవారు. మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలున్నా వారంతా కలిసే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా అంశాన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీదే. హోదా కోసం మనం అందరం కలిసి పోరాడుదాం. మాతో కలిసి రావాల్సిందిగా చంద్రబాబుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష తెలుగు ప్రజలు గర్వించదగ్గ పోరాటం. సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం’’ అని వైఎస్‌ విజయమ్మ పేర్కొన్నారు. 

తెలుగు గడ్డ మరిచిపోదు 
ఎంపీలను పరామర్శించడానికి దీక్షా శిబిరం వద్దకు విజయమ్మ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా నినాదాలు మిన్నంటాయి. కొద్దిసేపు ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. దీక్షా వేదికపై విజయమ్మ చాలాసేపు కూర్చున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర ముఖ్య నేతలంతా ప్లకార్డులు చేతబూని సంఘీభావంగా నిలిచా రు. దీక్ష చేస్తున్న వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలను ఆమె పలుకరించారు. మీరు చేసిన త్యాగాన్ని తెలుగుగడ్డ ఎప్పటికీ మరువ దని, ఈ పోరాటం తెలుగు ప్రజల హృదయా ల్లో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement