మేకపాటి రాజమోహన్ రెడ్డి (ఫైల్)
సాక్షి, ఢిల్లీ : లోక్‌సభలో సోమవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ రోజు సభ జరిగి ఉంటే మా తీర్మానం చర్చకు వచ్చేది. అయినా మరోసారి తీర్మాన నోటీసు ఇస్తాం. సభలో చర్చ జరిగేవరకు వదిలిపెట్టం. వైఎస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తృణముల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పార్టీ, శివసేన, తదితర పార్టీలు మద్దతు ఇచ్చాయి.
హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ఆయన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. వైఎస్సార్ సీపీ యువభేరికి వెళ్తే జైల్లో పెడతామని బెదిరించారు. మా ఆందోళనలు, బంద్‌లను భగ్నం చేసే యత్నం చేశారు. హోదాపై మొదటినుంచీ పోరాడుతున్నది వైఎస్సార్ సీపీనే. మాకు పదవులు కాదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యేక హోదా సంజీవినా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తామని చెబితే ఎవరూ నమ్మరు.
ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తుంటే ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అందుకోసమే ఇవాళ ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారన్నారు. కొంప మునిగిపోతుందని భావించి చంద్రబాబు బీజేపీ నుంచి విడిపోయారు. కొన్న టీవీ చానల్స్ వైఎస్‌ఆర్‌సీపీ ఏమీ చేయనట్లు, చంద్రబాబే అన్ని చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదు. రాబోయే రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పడం ఖాయం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment