ఓటమి తెలిసే సుహాసినికి సీటు | What Does Kukatpally Election Result Say? | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 9:23 AM | Last Updated on Wed, Dec 12 2018 4:37 PM

What Does Kukatpally Election Result Say? - Sakshi

సుహాసిని

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ కుమారుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్‌ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్‌ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ విభేదాలను రాజేశారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూకట్‌పల్లి స్థానం నుంచి హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు కల్యాణ్‌రామ్‌ను పోటీ చేయించాలని తొలుత బాబు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ద్వారా కల్యాణ్‌రామ్‌పై ఒత్తిడి తెచ్చారు. కల్యాణ్‌రామ్‌ ఒప్పుకోకపోవడంతో అనూహ్యంగా ఆయన సోదరి సుహాసినిని తెరపైకి తీసుకొచ్చారు.

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకునే క్రమంలో చంద్రబాబు అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెట్టారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. కూకట్‌పల్లి నుంచి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా తన రాజకీయాల కోసం బాబు ఆమెను పోటీ చేయించి ఘోర పరాజయంతో మరింత కుంగదీశారని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హరికృష్ణ ఆసక్తి చూపారని, పెనమలూరు సీటు అడిగినా చంద్రబాబు ఇవ్వలేదని, ఆయన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని టీడీపీ నేత చెప్పారు. హరికృష్ణ కుటుంబానికి మేలు చేయాలంటే ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక స్థానం ఇచ్చే ఆలోచన చేయకుండా, తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే చోట ఆయన కుమార్తెను బరిలోకి దించడం కచ్చితంగా బాబు చేసిన మోసమేనన్న వాదన వినిపిస్తోంది.

చంద్రబాబు వలకు చిక్కని కల్యాణ్‌రామ్‌
కొద్దిరోజుల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు చంద్రబాబు పట్ల అయిష్టత కనబరిచారు. అయినా పట్టువీడకుండా కల్యాణ్‌రామ్‌ను టీడీపీ పొలిట్‌బ్యూరోలో చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కల్యాణ్‌రామ్‌ ఆయన వలలో పడలేదు. తననూ వాడుకుని వదిలేస్తారనే అభిప్రాయంతో ఆయన చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుహాసినిని ఎన్నికల రంగంలోకి దించారు. సుహాసిని పోటీ చేయడం ఆమె కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు తెలిపారు.

హరికృష్ణ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని చెప్పుకునేందుకు, హరికృష్ణపై ఉన్న సానుభూతిని వాడుకోవడానికే చంద్రబాబు ఆమెను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించారని గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. వీటన్నింటికీ మించి హరికృష్ణ కుటుంబం తన చేయి దాటిపోకుండా ఉండేందుకు, జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చెక్‌ పెట్టేందుకు బాబు పన్నాగం పన్నినట్లు చెబుతున్నారు. బాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తమ సోదరికి మద్దతుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టలేదు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కారణంగా హరికృష్ణ కుమార్తె ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement