గుజరాత్‌ ఫలితాలు తలకిందులయ్యేనా?! | what surveys project on gujarat election | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఫలితాలు తలకిందులయ్యేనా?!

Published Sat, Nov 11 2017 1:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

what surveys project on gujarat election - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాలక, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాల గణాంకాలు రోజు రోజుకు మారుతున్నాయి. విజయావకాశాలపై ఏబీపీ–లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ గత ఆగస్టులో, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించిన ఎన్నికల సర్వేల్లోనే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతాగస్టులో నిర్వహించిన సర్వేలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి 60 శాతం ఓట్లు వస్తాయని తేలగా, అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో అది 47 శాతానికి పడిపోయింది. అదే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు పెరిగాయి.

గుజరాత్‌ పోలింగ్‌కు మరో 30 రోజులు ఉండడంతో పాలక, ప్రతిపక్షాల విజయావకాశాల గణాంకాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. తొలుత నిర్వహించిన ఎన్నికల సర్వేల్లో కాంగ్రెస్‌–సమాజ్‌వాది పార్టీల కూటమి విజయం సాధిస్తుందని తేలింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీ పోటాపోటీగా మారింది. తీరా పోలింగ్‌ నాటికి పరిస్థితి బీజేపీకి పూర్తి అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు గుజరాత్‌లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు, ఇటీవలి జీఎస్టీ వల్ల గుజరాత్‌ వ్యాపార వర్గం తీవ్రంగా దెబ్బతిన్నది. వారంతా మొదటి నుంచి బీజేపీ అనుకూలురు అవడంతో వారు పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేయరనే అందరూ భావించారు.

వారిలో కూడా స్పష్టమైన మార్పు వస్తున్నట్టు ఏబీపీ–లోక్‌నీతి–సీఎస్‌డీఎసస్‌ నిర్వహించిన సర్వే ఫలితాల సరళే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఎక్కువ మంది పాలకపక్షానికి ఎదురుతిరుగుతున్నారు. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో జీఎస్టీ నిర్ణయం మంచిదని 38 శాతం అభిప్రాయపడగా, ఫర్వాలేదని 22 శాతం మంది, మంచిదికాదని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే అక్టోబర్‌ నెలలో నిర్వహించిన సర్వేలో మంచిదని 24 శాతం మంది ఫర్వాలేదని 29 శాతం మంది, మంచిదికాదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. మంచిదన్న అభిప్రాయం 14 శాతం పడిపోగా, చెడ్డదన్న శాతం 15 పెరిగింది.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలు ఎలా మారాయో విశ్లేషిస్తే...గత మే నెలలో కేంద్రం పనితీరు పట్ల 75 శాతం మంది, రాష్ట్రం పనితీరు పట్ల 77 శాతం మంది సంతప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో కేంద్రం పట్ల 67 శాతం మంది, రాష్ట్రం పట్ల 69 శాతం మంది, అక్టోబర్‌ నెలలో కేంద్రం పట్ల 54 శాతం మంది, రాష్ట్రం పట్ల 57 శాతం మంది సంతప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల కాలంలో కనిపించిన ఈ వ్యత్యాసాలు ఇలాగే కొనసాగితే 30 రోజుల్లోనే విజయావకాశాల అంచలు తలకిందులయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ, ప్రభుత్వాలు ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తూ వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement