చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఆరంగేట్రం గురించి తెరవెనుక జోరుగా సన్నాహాలు జరుగుతున్నా.. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. చెన్నైలోని తన నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారా? అని ప్రశ్నించగా మే 23న తెలుస్తుందని ప్రకటించారు.
తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18న అత్యంత కీలకమైన ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొందకపోతే.. అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో మే 23న వెలువడనున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు అధికార అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వచ్చి.. తమిళనాడులో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు వస్తే.. పోటీ చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. అందుకు సిద్ధమేనంటూ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment