సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండుగ రానే వస్తోంది... కానీ ప్రధాన రాజకీయ పార్టీల సీట్ల పంచాయితీ మాత్రం తెగకపోవడంతో రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది మాత్రం అధికారికంగా వెల్లడి చేయడం లేదు. పోలింగ్‌కు మరో 18 రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారికంగా తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం గమనార్హం. సీట్లు, టికెట్ల గొడవలతోనే రాజకీయ పక్షాలు కాలం వెళ్లదీస్తుండగా, ఈ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేస్తే తమకు ఏం ఒరుగుతుందనేది సామాన్య ప్రజలకు అంతుబట్టడం లేదు. టీఆర్‌ఎస్ కేవలం పాక్షిక మేనిఫెస్టో విడుదల చేయగా, మిగిలిన పార్టీలు ఇంకా కసరత్తు దశలోనే ఉండిపోయాయి. కాంగ్రెస్ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాగా, ఇతర పార్టీలూ అడపాదడపా అది చేస్తాం... ఇది చేస్తామంటూ చెప్పడం.. అప్పుడప్పుడూ మీడియా కు లీకులివ్వడంతోనే సరిపెడుతున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించడంలో జాప్యం చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అన్నింటిదీ అదే తీరు...
ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేయాలన్న దానిపై ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కిరావడం లేదు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేసుకున్న ఆయా పార్టీలు ఇంతవరకు ముసాయిదా మేనిఫెస్టోలను కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 6నే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా ఇంతవరకు మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటించలేదు. ఇక, కూటమిలో సీట్ల సర్దుబాటు పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కాలం గడుపుతూ ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రకటించడంలోనూ, కూటమి పక్షాన ఉమ్మడి ఎజెండాను వెల్లడించడంలోనూ జాప్యం చేస్తున్నాయి. బీజేపీ, బీఎల్‌పీ, ఇతర పార్టీలు కూడా ఇంకా మేనిఫెస్టోలకు తుదిరూపు ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
పింఛన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతిపైనే చర్చ
ఈసారి ఎన్నికల్లో సామాజిక పింఛన్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంశాలే కీలకం అవుతాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, టీఆర్‌ఎస్ కూడా కాంగ్రెస్ ప్రకటించిన దాని కన్నా ఎక్కువగా మరో రూ.16 జోడించింది. నిరుద్యోగ భృతి విషయంలోనూ పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ చెప్పగా, కాలపరిమితిని వెల్లడించనప్పటికీ గతంలో లాగానే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ వెల్లడించింది. మిగిలిన పార్టీలు పింఛన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
పాక్షికంతోనే ఆగారెందుకు..?
పార్టీల పరంగా చూస్తే టీఆర్‌ఎస్ మాత్రమే మేని ఫెస్టో అంటూ అధికారిక ప్రకటన చేసింది. పాక్షిక మేనిఫెస్టో పేరుతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గత నెలలో కొన్ని ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బోలెడన్ని హామీలు ఇచ్చినా అధికారికంగా మేనిఫెస్టోను మాత్రం ప్రకటించలేదు. బీజేపీ కూడా ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కట్టుకునేంతవరకు ఇంటి అద్దె చెల్లిస్తామనే ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తోంది. కానీ, ఆ పార్టీ ఇంకా ముసాయిదా దశలోనే ఉంది.
అమరవీరుల పేరుతో...
అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ చెబుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని, కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) పేరుతో ఉండే ఈ ఎజెండాలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రధానాంశంగా ఉంటుందని చెప్పాయి. కానీ, అమరవీరుల ఎజెండా ఏమైందో... ఆ ఎజెండాపై కసరత్తు ఎంతవరకు వచ్చిందన్నది మాత్రం తేలడం లేదు. మరి, ఈ పార్టీలు ఎప్పటికి స్పందిస్తాయో... మేనిఫెస్టోలు, కూటమి ఉమ్మడి ప్రణాళికను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాయో... ప్రజల్లో వీటిపై ఎప్పుడు చర్చ జరగాలో... ఎవరికి ఓటేయాలనేది ఓటరు దేవుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలో అంతుపట్టని పరిస్థితి నెలకొంది.
ఒకరి కోసం ఇంకొకరు...
మేనిఫెస్టోల జాప్యంలో టికెట్ల ఖరారు అంశం ప్రధానమైంది కాగా, ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల విషయంలో సీరియస్‌గా ఉండటం, ఒక పార్టీ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా తామూ ప్రకటిద్దామని మరో పార్టీ వేచి చూస్తుండటం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను 3 రోజుల్లోగా 3 సెట్ల చొప్పున తమకు సమర్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టోల్లో వ్యక్తిగత ప్రయోజనాలను హామీగా ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ప్రకటించడంతో మేనిఫెస్టోల తయారీలో అన్ని పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment