సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సష్టించిందని, ఏడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కైవసం చేసుకొందని, కాంగ్రెస్, వామపక్షాలను పూర్తిగా తుడిచి పెట్టేసిందని కాషాయ వర్గాలు తుపానుకన్నా బీభత్సంగా ప్రచారం చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలో ఆ పార్టీ ప్రభావం పెరిగిన మాట వాస్తవమేగానీ ప్రచారం చేసుకుంటున్నంతగా కాదు. అందులో సగం కూడా కాదు. ఆరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంటున్న మాట కూడా వాస్తవమేగానీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే అది ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఛోదక శక్తిగా వ్యవహరించింది.
బీజేపీ సహా కాషాయ వర్గాలు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభంజనం, పెను తుపాను లాంటి మాటలను పక్కన పెడితే ఏడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కూడా మరీ ఎక్కువేమి కాదు. త్రిపురలో 43, మణిపూర్‌లో 36.28, అరుణాచల్ ప్రదేశ్‌లో 30.97, అస్సాంలో 29.51, నాగాలాండ్‌లో 15.3, మేఘాలయలో 9.6, మిజోరంలో 0.37 శాతం. 60 స్థానాలు కలిగిన త్రిపురలో 43 శాతం ఓట్లతో 35 సీట్లను బీజేపీ గెలుచుకొని ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. సీపీఎం 42.7 శాతం ఓట్లతో 16 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాకపోతే సీపీఎం 59 సీట్లకు పోటీ చేయగా, బీజేపీ 51 సీట్లకు పోటీ చేసింది. పోటీ చేసిన సీట్లలో 70 శాతం గెలుచుకోవడం ద్వారా బీజేపీ త్రిపురలో ఎక్కువగానే లాభ పడింది. సీపీఎం 29 శాతం సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. త్రిపుర పీపుల్స్ ఫ్రంట్ 9 సీట్లకు పోటీచేసి, ఎనిమిది సీట్లను గెలుచుకోవడం ద్వారా అన్ని పార్టీలకన్నా ఎక్కువగా రాణించింది.
మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీది విజయం అని కూడా చెప్పలేం. మేఘాలయలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ పార్టీ కేవలం రెండంటే రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న జెయింటియా హిల్స్‌లో కూడా బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 21 సీట్లను గెలుచుకుంది. బీజేపీ మద్దతిచ్చిన నేషనల్ పీపుల్స్ పార్టీకి 19 సీట్లు వచ్చాయి. దాంతో ఆ పార్టీ బీజేపీ, హిల్ స్టేట్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జేడీయూ, ఓ స్వతంత్య్ర అభ్యర్థి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రభుత్వం ఎంతోకాలం సుస్థిరంగా ఉండే అవకాశం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని హిల్‌స్టేట్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సోమవారం నాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెల్సింది. ఇక నాగాలాండ్‌లో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు రాగా, ఈ సారి 12 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతాన్ని. 1.8 నుంచి 15. 3 శాతానికి పెంచుకుంది. ఇక్కడ బీజేపీ మద్దతిచ్చిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. నాగాలాండ్‌లో ఈ రెండు పార్టీలకు కలిసి 29 సీట్లు వచ్చాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న నాగా పీపుల్స్ పార్టీకి 27 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో చిన్నా, చితక పార్టీలను కలుపుకొని బీజేపీ మద్దతిచ్చిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment