సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గం ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా తయారయింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందో తెలుసుకోవడమే ప్రశ్న, ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు బాబూలాల్ గౌర్ (88)ను భోపాల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కలుసుకొని ప్రశ్నించింది.
‘దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు. పైగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. ఇక బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ రాజకీయాలకు కొత్త. వీరిద్దరి మధ్య ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పడం కష్టం. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఉన్నారు, క్యాడర్ లేరు. బీజేపీకి క్యాడర్ ఉంది. ఆరెస్సెస్ కార్యకర్తలు కూడా వచ్చి బూత్ స్థాయిలో పనిచేస్తారు. ఈ విధంగా చూసుకుంటే ఇరువురి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజ్ఞాసింగ్ అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. లేకపోయినట్లయితే ఆమె విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి’ అని బాబూలాల్ గౌర్ చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌కు వ్యతిరేకంగా, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐపీఎస్ అధికారికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటలపాటు నిషేధం విధించడం, దాంతో ఆమె ప్రస్తుతం గుళ్లూ గోపురాలు తిరుగుతున్న విషయం తెల్సిందే.
ప్రజ్ఞాసింగ్ తరఫున ఇతర రాష్ట్రాలకు చెందిన ఠాకూర్లు కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, వారితోపాటు ఆరెస్సెస్, బజరంగ్ దళ్, దుర్గా వాహిణి, ఏబీవీపీ కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తున్నారని గౌర్‌ను కలుసుకోవడానికి వచ్చిన ప్రజ్ఞాసింగ్ ఎన్నికల ప్రచార సమన్వయ కర్త జస్వంత్ సింగ్ హడా అత్యుత్సాహంగా చెప్పారు. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం కూడా భోపాల్ ఎన్నికల ప్రచారంపై దృష్టిని కేందీకరించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
1989 నుంచి బీజేపీ వరుసగా గెలుచుకుంటూ రావడంతో భోపాల్ సీటు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగ మారింది. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాల కారణంగా బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి కేఎన్ ప్రధాన్ విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుశీల్ చంద్ర వర్మ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమి లేదు. ఇక నరేంద్ర మోదీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీసీ శర్మపై బీజేపీ అభ్యర్థి అలోక్ సంజార్ ఏకంగా 3,70,000 మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఈసారి భోపాల్‌పైగానీ, మధ్యప్రదేశ్‌లోగానీ నరేంద్ర మోదీ హవా కనిపించడం లేదని, ప్రజ్ఞాసింగ్ గెలిస్తే స్థానిక బలిమితోనే గెలవాలని బాబూలాల్ గౌర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఐదు వారాలు తాత్సారం చేయడమే బీజేపీకి ఈసారి భోపాల్‌లో ఎంత బలం ఉందో అర్థం అవుతుంది. దిగ్విజయ్‌ను ఎలాగైన ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో బీజేపీ, ప్రజ్ఞాసింగ్ పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment