
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో పార్టీ బతకాలంటే పొత్తులు తప్పనిసరి. ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీనే తమను వద్దంటోందని స్వయంగా చంద్రబాబే చెప్పిన నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తి కలిగిస్తోంది.
అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లలో ఏ పార్టీతో టీడీపీకి పొత్తు ఉంటుందనేది కేడర్‌లోనూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలపై టీడీపీలో పెద్దగా సానుకూలత కనిపించడం లేదు. తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు ఇందుకు అనుకూలించవని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా కనిపించే కాంగ్రెస్‌తో తాము ముందుకు వెళ్లగలమా అనే ప్రశ్న తెలంగాణ తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా కూడా కాంగ్రెస్‌తో పొత్తు కోసం చంద్రబాబు సిద్ధపడకపోవచ్చని టీటీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఓటమి ఖాయమనే స్పష్టమైన అంచనాలు వస్తే మాత్రం తమ నాయకుడు కీలక నిర్ణయం తీసుకుంటారని, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలసి వెళ్లినా ఆశ్చర్యం లేదని టీటీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్రంలో మళ్లీ మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే పరిస్థితులు ఉంటే మాత్రం చంద్రబాబు కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడరని ఆయన పేర్కొన్నారు.
‘కారు’ఎక్కాలా...
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలసి వెళ్లక తప్పదనే అభిప్రాయం టీటీడీపీలోని కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌కు, తమకు కొన్ని సానుకూలతలున్నాయని, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న మెజారిటీ నేతలు తమ పార్టీ నుంచి వెళ్లినవారే కావడంతోపాటు సామాజిక వర్గాల కోణంలోనూ ఆ పార్టీ నేతలతో ఇమిడిపోగలమని అంటున్నారు. టీఆర్‌ఎస్ అంగీకరిస్తే అన్ని రకాలుగా సాయం అందుతుందని, అప్పుడు కొన్ని సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
అయితే పార్టీ వర్గాల్లో అంతర్గతంగా మరో వాదన కూడా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఇప్పటికే పునాదులు పడ్డాయని, రాష్ట్రంలోని ఇద్దరు మీడియా పెద్దల సహకారంతో గులాబీ పార్టీ ముఖ్య నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే తెలంగాణ రాజ్యసభ సభ్యుడు ఒకరు ఈ చర్చలకు పార్టీ తరఫున వెళ్లారని తెలిసింది. టీడీపీ, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఆవశ్యకతను మీడియా పెద్దలు ఈ సందర్భంగా వివరించారని సమాచారం.
ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే టీడీపీకి 25 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ప్రతిపాదించారని ఈ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. పొత్తులో సీట్ల ప్రతిపాదనను టీఆర్‌ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని తెలిసింది. ప్రాథమిక సమావేశంలోనే సీట్ల పంపకాలపై చర్చలు ఎందుకులే అనే భావనతో రెండు వర్గాలూ చర్చలను వాయిదా వేశాయని సమాచారం. ఈ భేటీ సమాచారం తెలిశాకే రేవంత్‌రెడ్డి పార్టీ మారారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే ఆశ కలిగించడం ద్వారా టీడీపీలో మిగిలిన కొందరినైనా జారిపోకుండా చూసుకునే వ్యూహంతోనే బాబు ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సైతం పార్టీ నేతల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment