సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై మార్చి 15న దాడి జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యను తీవ్రంగా ఖండిస్తూ పలువురు దేశాధినేతలు సొంత ట్విట్టర్ ఖాతాల ద్వారా స్పందించారు. బాధితులకు నివాళులర్పించారు. ఆ మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ నిర్ధారించినప్పటికీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు తన సొంత ట్విట్టర్ ద్వారా స్పందించక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలే కాకుండా పాకిస్థాన్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల సందర్భాల్లో కూడా తక్షణమే స్పందించి మృతులకు నివాళులర్పించే మోదీ ఏకంగా 50 మంది పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యపై స్వయంగా స్పందించక పోవడం ఏమిటన్నది వారి ప్రశ్న.
అయితే అదే రోజు నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేస్తూ న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్దర్న్‌కు ఓ లేఖ రాశారంటూ భారత విదేశాంగ శాఖ ఓ లేఖను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడియు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తదితరులు వ్యక్తిగతంగా స్పందిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపారు. భారత్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు వ్యక్తిగత ఖాతాలా ద్వారా సోషల్ మీడియాలో స్పందించారు.
పెషావర్ స్కూల్‌లో టెర్రరిస్టు దాడికి 156 మంది చనిపోయినప్పుడు 2014, డిసెంబర్‌లో ప్రధాని మోదీ తన ట్వట్టర్‌లో స్పందించారు. 2015, జనవరి నెలలో పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంలో టెర్రరిస్టులు దాడి చేసి 17 మందిని చంపినప్పుడు కూడా మోదీ వెంటనే స్పందించారు. ఆ తర్వాత మే నెలలో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు ఓ బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 46 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. గత మార్చి 14వ తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతనెలో ఓ భాగం కూలి ఆరుగురు మరణించినప్పుడు కూడా మోదీ స్వయంగా స్పందించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈసారి ఆయన సొంతంగా స్పందించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన దాడులకు ముస్లిం టెర్రరిస్టులు బాధ్యులవడం, న్యూజిలాండ్‌లో జరిగిన దాడికి ఓ శ్వేత జాత్యాహంకారి బాధ్యుడు అవడం, అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం లాంటి అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా స్పందించకపోయి ఉండవచ్చన్నది విమర్శకుల వాదన.
Comments
Please login to add a commentAdd a comment