సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించగల ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే అని, ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా నిలిపిన ఘనత వైఎస్ జగన్‌దేనని ఆ పార్టీ ఎంపీలు అన్నారు. హోదా సాధనలో భాగంగా పార్లమెంట్‌లో తుది వరకూ పోరాడుతామని చెప్పారు. బుధవారం సభ వాయిదా అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
సోమవారం కీలకం: ‘‘సభ నిరవధికంగా వాయిదా పడుతుందన్న ప్రచారానికి భిన్నంగా స్పీకర్ సోమవారానికి వాయిదావేశారు. ఆ రోజు అవిశ్వాసంపై చర్చ జరుగుతుందన్న నమ్మకం మాకుంది. ఇప్పటికే చాలా పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచాయి. ఒకవేళ సభ నిరవధికంగా వాయిదా పడితే, మరుక్షణమే మా పార్టీ ఎంపీలం రాజీనామాలు సమర్పిస్తాం’’ అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
ఎందుకు కీలకమంటే..: ‘‘అవిశ్వాస తీర్మానంపై చర్చను కోరుతూ తొమ్మిదో సారి కూడా మేం నోటీసులు ఇస్తాం. సభను అడ్డుకుంటోన్న అన్నాడీఏంకే ఎంపీలను మేం రిక్వెస్ట్ చేశాం. ఏపీకి ప్రాణాధారమైన హోదా కోసం ఒక్క ఐదు నిమిషాలు సహకరించాలని అడిగా. అందుకు వారివైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది. గురువారం(మార్చి 29న) కావేరీ రివర్ బోర్డుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. ఆ నేపథ్యంలో తమిళ ఎంపీలు ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. మేం తుదిదాకా పోరాడుతాం’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
పార్లమెంట్‌కు ఎజెండా నిర్ణయించింది వైఎస్సార్‌సీపీ: ‘‘ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తొలిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్సార్‌సీపీ ఒక్కటే. అదే ఇప్పుడు.. దేశంలోని మెజారిటీ పార్టీలు మమ్మల్ని అనుసరిస్తున్నాయి. దేశం మొత్తానికి ఇవాళ ఏపీకి హోదా, కేంద్రంపై అవిశ్వాసం అంశాలే కీలకంగా మారాయి. ఒకరకంగా పార్లమెంట్‌లో ఎజెండాను నిర్ణయించింది వైఎస్సార్‌సీపీనే. సమావేశాల చివరిరోజు దాకా పోరాడాలనుకుంటున్నాం. ఒకవేళ మధ్యలోనే సభ నిరవదికంగా వాయిదాపడితే అప్పటికప్పుడే రాజీనామాలు చేస్తాం’’ అని ఎంపీ వరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment