సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తున్న కిరణ్ బేడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి మధ్య వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
గత ఏడాది జరిగిన ప్రైవేటు కళాశాలల్లో వైద్య సీట్ల భర్తీలో అవకతవకలు గవర్నర్-సీఎంల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అర్థంలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. కాగా, శనివారం హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సీఎం నారాయణస్వామి.. బేడీ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు.
‘‘అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తూ, హెచ్చరికలతో ముందుకు సాగుతున్న కిరణ్ బేడీపై అవసరమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం. అసలు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అర్హురాలేకాదు. కానీ కేంద్రం ఆమెను మాపై పడేసింది. ఇప్పుడు మాకు ఆమె శిరోభారంగా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, ఖండనీయం’’ అని సీఎం నారాయణస్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు.