సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పట్టించుకోవట్లేదని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సోమవారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ‘తమిళనాడుకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని భరోసా ఇచ్చింది.
‘తమిళనాడు సమస్య మాకు అర్థమైంది. కావేరీ జలాల విషయంలో సత్వర న్యాయం జరిగేలా చూస్తాం’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటును కోరుతూ గతకొన్ని రోజులుగా తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఈ అంశంపై కేంద్రం స్పందిస్తూ... ‘ఇది చాలా సున్నితమైన అంశమని.. పైగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నామని’ సుప్రీంకోర్టుకు నివేదించింది.
కాగా, ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కావేరీ జల వివాదంపై తీర్పునిస్తూ.. తమిళనాడు వాటాను తగ్గించి, కర్ణాటక రాష్ట్రానికి అధిక వాటాను కేటాయించింది. బెంగుళూరు సిటీ అవసరాల దృష్ట్యా ఈ తీర్పునిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆ సమయంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment