విలేకరులతో మాట్లాడుతున్న వరుదు కల్యాణి
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు అంతులేకుండా పోతుందని, గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు మహిళలు నడవలేని దౌర్భపాలనలో ఉన్నామని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో గత నాలుగు నెలల్లో 281 మంది అత్యాచారాలకు గురయ్యారన్నారు. గుంటూరులోనే నెలరోజుల వ్యవధిలో ఏడుగురు మహిళలు అత్యాచారాలకు గురయ్యారంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందో స్పష్టమవుతుందన్నారు. ఆడపడుచులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న ఎమ్మెల్యే రోజాపై అవాకులు చేవాకులు పేలుతున్నారన్నారు.
తోటి మహిళా ఎమ్మెల్యే గుండు గీయిస్తానంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అగౌరవంగా మాట్లాడి మహిళలపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారన్నారు. గతంలో దళిత మహిళను వివస్త్ర చేసిన బండారు సత్యనారాయణకు మహిళలే బుద్ధి చెబుతారన్నారు. టీడీపీ మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారన్నారు.
ఈయన మాటలు మహిళలు వింటే వెంకన్నను చెప్పుతో కొడతారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో బుద్దా పాత్ర ఉందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారన్నారు. కాల్‌మనీ, నారాయణ కాలేజీలో విద్యార్థినుల ఆత్మహత్యల విషయంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిందన్నారు. దాచేపల్లి మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో వారి అండగా ఎమ్మెల్యే రోజా పోరాటం వృథా పోలేదన్నారు.
రోజా టీడీపీలో ఉన్నప్పడు చేసే పోరాటాలు ప్రజాపోరాటాలు అంటూ పొగిడిన నేతలు నేడు వైఎస్సార్‌సీపీ తరుపున చేస్తే రాజకీయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ఎమ్మెల్యే బండారు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షమాపణలు చెప్పకుంటే మహిళల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. సమావేశంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, రాష్ట్ర అధికార ప్రతనిధి ఎం.శ్రీదేవి, రాష్ట్ర జనరల్ సెక్రటరీలు శ్రీదేవి వర్మ, మళ్ల ధనలత, మహిళా నాయకులు శ్రీదేవి, ఎ.వి.రమణి, శిరిష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment