సాక్షి, చెన్నై: తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, కమల్ హసన్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి.. తన మద్దతుదారులు, ప్రజలు అందులో నమోదు చేసుకొని.. తనకు మద్దతు పలుకాలని పిలుపునిచ్చారు. మరోవైపు కమల్ కూడా తన మద్దతుదారులను కూడగట్టేందుకు ఓ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయ నాయకులుగా కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీ, కమల్ ఎప్పటికీ చేతలు కలిపే అవకాశం లేదని, వారు రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే కొనసాగవచ్చునని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ తాజాగా రాసిన ఓ వ్యాసంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన రాజకీయ ప్రస్తానంలో స్నేహితులను శత్రువులుగా మార్చుకోబోనని, నిందా రాజకీయాలకు పాల్పడి.. రాజకీయ అందలం కోసం ప్రయత్నించబోనని కమల్ పేర్కొన్నారు. ఆ రకమైన రాజకీయాలు తన మార్గం కాదని, అవి ప్రజలకు కూడా నచ్చవని కమల్ అన్నారు.
జనవరిలో యాప్ విడుదల చేస్తానని చెప్పిన కమల్ ఇప్పటివరకు దానిని ఆవిష్కరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ.. చాలా ఆచితూచి ప్రజలకు అనుసంధానమయ్యేలా యాప్‌ను తీసుకొస్తున్నానని, త్వరలోనే యాప్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment