హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ ఉరవకొండలో నిర్వహించిన 34 గంటల దీక్ష సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి (ఫైల్)
ఉద్యమాల ఖిల్లా...ఉరవకొండ...ప్రజా పోరాటం..అభివృద్ధి కోసం ఆరాటం.. నాలుగన్నరేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సాగిస్తున్న సమరనాదమిది. ప్రభుత్వం నిధులివ్వకుండా వివక్ష చూపినా..స్థైర్యం కోల్పోక ప్రజలకు అండగా నిలిచారు. సాగు, తాగునీరు, పంటలకు మద్దతు ధర, ఇళ్లు, ఇంటి స్థలాలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ప్రజా ఉద్యమాలు నిర్మించారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్య పరిష్కరించేలా అలుపెరగని పోరాటం చేశారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని..అప్పుడే అందరికీ మేలు జరుగుతుందని పేదలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
అనంతపురం, ఉరవకొండ: ప్రజా ఉద్యమాలే శ్వాసగా, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాలుగున్నరేళ్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసం రోడ్డెక్కిన ఎమ్మెల్యే తీరునచ్చిన వామపక్షాలూ మద్దతు పలికాయి. ఎమ్మెల్యే చేపట్టిన ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచాయి.
ఒకే ఒక్కడు
జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ గుర్తుపై ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా అధికార పార్టీకి అమ్ముడుబోయారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన విశ్వేశ్వరరెడ్డి మాత్రం ప్రజా సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తూ ఉరవకొండ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.
సాగు నీటి కోసం అలుపెరగని పోరాటం
రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత హంద్రీనీవా తొలిదశ కింద మిగిలి ఉన్న పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. తొలిదశలో జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా...అత్యధికంగా 80 వేల ఎకరాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిత ఆయకట్టుకు ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వకపోగా..నీటిని కుప్పంకు తీసుకువెళ్లేందుకు జిల్లాలో డిస్ట్రిబ్యూటరీలను, పిల్ల కాల్వను రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్యే విశ్వ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి డిస్ట్రిబ్యూటరీలు రద్దు చేస్తూ ఇచ్చిన జీఓ నిలుపుదల చేసింది. ఫలితంగా నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా నీటిని మళ్లించారు.
ఇళ్లకోసం ధర్నాలు
ఉరవకొండ పట్టణంలోని వైఎస్సార్ హయాంలో 88 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వేలాది మందితో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మహాధర్నా చేపట్టారు. పోలీసులు బలవంతంగా ఆయన్ను అరెస్టు చేశారు. ఇంతకు ముందు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులతో కలిసి 32 గంటల దీక్ష, పాత బస్టాండ్ వద్ద 24గంటల దీక్షలు చేపట్టారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్నీ మండల కేంద్రాల్లో పేదల ఇంటిపట్టాల కోసం ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. అంతేకాకుండా
చేనేత కార్మికులకు పాసుపుస్తకాలు, ముద్రరుణాలు ఇవ్వాలని ఉరవకొండ పట్టణంలో చేనేతల ధర్నా, సదస్సులు చేపట్టారు. మైనార్టీ సమస్యలపై ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన మైనార్టీ సదస్సు విజయవంతమైంది.
ప్రధాన సమస్యలు.. ఎమ్మెల్యే చర్యలు
♦ హంద్రీనీవా తొలిదశ ఆయకట్టులో ఉరవకొండ నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాలున్నాయి. అయితే హంద్రీనీవా ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరినా..టీడీపీ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. అంతేకాకుండా రాకెట్ల–ఆమిద్యాల లిఫ్ట్ పనులను కూడా చేపట్టలేదు.
♦ హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని ఎమ్మెల్యే విశ్వ దశలవారీగా ఎన్నో పోరాటాలు చేశారు. దిగి వచ్చిన ప్రభుత్వం నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలలతో నింపింది. అందువల్లే డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోయినా రైతులు చెరువు నీటితో పంటలు సాగు చేస్తున్నారు.
♦ జీడిపల్లి గ్రామంలో రిజర్వాయర్ దగ్గరగా ఉండటంతో ఊట నీరు ఇళ్లలోకి వెళ్లి గ్రామం మొత్తం దెబ్బతింది. తమను ఆదుకోవాలంటూ గ్రామస్తులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.
♦ జీడిపల్లి గ్రామానికి పునరావసం కల్పించాలని ఎమ్మెల్యే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎన్నోమార్లు విన్నవించారు. గ్రామçస్తులతో కలిసి కలెక్టరేట్‌ను కూడా ముట్టడించారు. ఎమ్మెల్యే పోరాటాలతో స్పందించిన ప్రభుత్వం.. ఆర్‌ఆర్ యాక్టు కింద జీడిపల్లి గ్రామానికి పునరాసవం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
♦ ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లో పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వడానికి రూ.4 కోట్లు వెచ్చించి 140 ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్... నేటికీ పట్టాలు పంపిణీ చేయలేదు.
♦ అర్హులైన పేదలకు ఇంటిపట్టాలు పంపిణీ చేయాలని విశ్వేశ్వరరెడ్డి సుదీర్ఘ పోరాటాలు చేశారు. ఉరవకొండలో వేలాది మందితో రోడ్డుపైనే ఎమ్మెల్యే బైఠాయించి అరెస్టు కావడంతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గింది. పట్టాల పంపిణీకి అధికారుల చేత సర్వే చేయించి జాబితాలు సైతం సిద్ధం చేశారు. మిగితా మండలాల్లో కూడా పేదలకు ఇంటిపట్టాల ఇవ్వాలని ఎమ్మెల్యే ఆయా తహసీల్దార్ కార్యాలయల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో అర్హులను గుర్తించడానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
పోరాడి నిధులు సాధించాం
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వం నిధులివ్వడం లేదు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు విడుదల కోసం ప్రభుత్వంపై ఎంతో ఒత్తడి చేశా. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండకు వచ్చి సాగునీటి కోసం ధర్నా చేపట్టారు. మా పోరాటల ఫలితంగానే రోడ్లు, పెన్నహోబిళం దగ్గర వంతెన, హంద్రీనీవా ద్వారా చెరువులు, డిస్ట్రిబ్యూటరీలకు సాగునీరు, జీబీసీ ఆధునికీకరణ పనులు జరిగాయి. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేస్తా.– వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ
Comments
Please login to add a commentAdd a comment