దాచేపల్లి(గురజాల): ‘నన్ను ఒకవైపు మాత్రమే చూశారు.. మరోవైపు చూడాలనుకోవద్దు.. తేడా వస్తే తాట తీస్తా..అంటూ’ గురజాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. ‘నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు.
వైఎస్సార్ సీపీకి బలమైన గ్రామం ఇరికేపల్లి
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి ఇరికేపల్లి బలమైన గ్రామం. ఎస్సీ కాలనీలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. ఈ కాలనీకి చెందిన మాతంగి మమత వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచింది. ఎస్సీ కాలనీలో పట్టుకోసం టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏ విధంగానైనా సరే బెదిరించి అయినా ఎస్సీ కాలనీలో పాగా వేయాలనే ఉద్దేశం టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ..కాలనీలో ఇప్పటివరకు వీరికి ఆదరణ లభించలేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన యరపతినేని ఎస్సీ కాలనీలో వారిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, యరపతినేని చేసిన ఘాటు వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళితులను బెదిరించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment