
తిరుత్తణి (తమిళనాడు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్పం’ విజయవంతం కావాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి పాదయాత్ర చేసుకుంటూ తిరుత్తణికి చేరుకొని సుబ్రహ్మణ్యస్వామికి పూజలు నిర్వహించారు. అలాగే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు జిల్లా అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామికి 1008 కొబ్బరికాయలు కొట్టారు. వివరాలు.. చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర బుధవారం తమిళనాడులోని తిరుత్తణి ఆలయానికి చేరుకుంది.
వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి బుధవారం ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. దీంతో తిరుత్తణి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. కుమారుడు మోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలసి చెవిరెడ్డి దంపతులు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు వారిని ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకొని.. వారి కష్టాలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారని వివరించారు. ఈ యాత్ర విజయవంతం కావాలనే ఆకాంక్షతో తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు.
వెంకన్న ఆశీస్సుల కోసం..
సాక్షి, తిరుమల/వడమాలపేట: ప్రజాసంకల్పం విజయవంతం కావాలని, వైఎస్ జగన్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం 1008 కొబ్బరికాయలు కొట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వెంకన్న ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్ననట్లు తెలిపారు. ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌రాజు, పార్టీ నేతలు కేజే కుమార్, దిలీప్‌రెడ్డి, మాహీన్, లలిత, రంగనాథం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమామ్ ఆధ్వర్యంలో 600 మందికిపైగా యువజన, విద్యార్థి నాయకులు తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి వద్ద 3 వేల కొబ్బరికాయలు సమర్పించారు. భూమన అభినయ్, పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













Comments
Please login to add a commentAdd a comment