సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిని అడ్డం పెట్టుకొని పేదలు, చిరు వ్యాపారుల కడుపుకొడుతూ ఆయన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్, ఇతర కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. దేశమంతా జీఎస్టీ అమలు చేస్తుంటే కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో అదనంగా సీఎస్టీ (చంద్రబాబు సర్వీస్ ట్యాక్స్)ని కూడా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల కట్టలకు, కార్పొరేట్ శక్తులకు పుట్టిన బిడ్డలా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. చౌక ధరల దుకాణాలను మాల్స్‌గా మార్చి హెరిటేజ్‌కు వాటాలున్న ఫ్యూచర్, వారికి సన్నిహితమైన రిలయన్స్ గ్రూపునకు అప్పగించే యత్నం చేస్తున్నారని విమర్శించారు.
మాల్స్ వెనుక వేల కోట్ల డీల్...
రాష్ట్రంలోని 28 వేల రేషన్ షాపుల ద్వారా గతంలో 9 నుంచి 10 సరుకులు పేదలకు అతి తక్కువ ధరకే అందించేవారని రోజా గుర్తు చేశారు. ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎత్తివేస్తే.. దివంగత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక సంతృప్త స్థాయిలో పేదలందరికీ సరుకులు అందించారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రేషన్ షాపుల్లో బియ్యం మినహా మరేమీ ఇవ్వటం లేదని, ఇప్పుడు వీటిని కార్పొరేట్ మాల్స్‌కు అప్పగించే కుట్రకు తెరతీశారన్నారు. చంద్రన్న మాల్స్‌లో తక్కువ ధరకు సరుకులు ఇస్తామని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిరంగ మార్కెట్‌లో దొరికే నిత్యావసర సరుకులతో పోలిస్తే హెరిటేజ్, ఫ్యూచర్, రిలయన్స్ మాల్స్‌లలో దొరికే సరుకులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని రోజా తెలిపారు. కార్పొరేట్ మాల్స్‌లో 200 నుంచి 300 శాతం అధికంగా ధరలు ఉంటాయని పంచదార, గోధుమలు, తదితర సరుకుల ధరల వివరాలతో సహా వివరించారు. ఫ్యూచర్ గ్రూపు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సరుకులను ఎందుకు తగ్గించి ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 21 రకాల పథకాలకు చంద్రన్న అని పేరు పెట్టుకున్నారని రోజా పేర్కొన్నారు. ప్రతి దానికీ చంద్రన్న పేరు పెట్టుకోవడానికి ఆయన తండ్రి ఆస్తిలో నుంచి వాటా తెచ్చి ఏమైనా ప్రజలకు ఇస్తున్నారా? అని రోజా సూటిగా ప్రశ్నించారు.
ఐదు నెలల్లో ఆస్తులు 20 రెట్లు ఎలా పెరిగాయ్?
పాలు, కూరగాయలు అమ్ముకుంటేనే చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఐదు నెలల్లో 20 రెట్లు పెరిగితే మరి గేదెలకు తిండిపెట్టి పాలు పట్టే మహిళలు, రైతులకు ఎన్ని రెట్లు ఆస్తులు పెరగాలని రోజా ప్రశ్నించారు. లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేసినప్పటి నుంచీ చంద్రబాబు పూర్తిగా సూట్ కేసుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. వర్థంతి, జయంతికి... రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియని లోకేష్‌ను మంత్రిగా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబుకు ఓట్లు వేయాలని ఊరూవాడా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. నేడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏ హక్కుతో ప్రశ్నిస్తున్నారని రోజా నిలదీశారు. కాపులు, రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, ప్రతి ఒక్కరికీ అన్యాయం చేసిన చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి ఆయన జగన్‌ను ప్రశ్నిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment