బీజేపీకీ సంకీర్ణ పరిస్థితే.. | Yeddyurappa Busy With Meeting in Karnataka | Sakshi
Sakshi News home page

సవాళ్లతోనే సాగాలి

Jul 25 2019 7:41 AM | Updated on Jul 25 2019 7:41 AM

Yeddyurappa Busy With Meeting in Karnataka - Sakshi

బుధవారం యడ్యూరప్ప నివాసం వద్ద నేతలు, అభిమానులు

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. నేడో, రేపో కర్ణాటక కొత్త సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప ప్రమాణం చేయనున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. రాష్ట్రంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేబినెట్‌ ఏర్పాటు ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. మంత్రివర్గంలో చోటు లభించలేదనే కారణంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఇదే క్రమంలో బీజేపీలో కూడా కేబినెట్‌ లేనిపోని తంటా తెస్తుందని భావిస్తున్నారు. అయితే మంత్రిమండలి ఏర్పాటులో ఎలాంటి అసమ్మతి లేకుండా ముగిస్తే ప్రభుత్వం కొన్నాళ్లు ప్రజా సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో సర్కారు మనుగడ కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు బల నిరూపణ ఓ వైపు.. రాజీనామాల విషయంలో తుది నిర్ణయం ఏంటనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అంతేకాకుండా రాజీనామా ఆమోదించాలా? లేక వారే ఉపసంహరించుకుంటారా తెలియలేదు. ఉపసంహరించుకుంటే బీజేపీకి తిప్పలు తప్పవు. అలా కాదని.. రాజీనామా ఆమోదించి.. పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తే బీజేపీకి లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఢిల్లీ నుంచి డైరెక్షన్‌?
బీజేపీ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గం, డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనేది ఢిల్లీలోని బీజేపీ పెద్దలే నిర్ణయిస్తారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వం పతనం విషయంలో కూడా ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లోనే స్థానిక బీజేపీ నాయకులు నడిచినట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య తగాదా పెట్టి.. ప్రజల్లో వ్యతిరేకతా భావాలు తీసుకురావడంతో బీజేపీ నాయకులు విజయం సాధించారని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం రేసులో పలువురు సీనియర్‌ నాయకులు రేసులో ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి రాజీనామా చేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరి కేబినెట్‌బెర్తు ఆశిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం రేసు లో అరవింద లింబావళి, ఆర్‌.అశోక్, కేఎస్‌ ఈశ్వర ప్ప, బి.శ్రీరాములు పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధం గా కాంగ్రెస్‌ నుంచి రమేశ్‌ జార్కిహోళి, జేడీఎస్‌ నుంచి హెచ్‌.విశ్వనాథ్‌ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఉపముఖ్యమంత్రి స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది.

అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి?
సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలు 15 మంది రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాజీనామాలపై ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ వారు రాజీనామా ఉపసంహరించుకుంటే బీజేపీ బలం తగ్గిపోతుంది. ఫలితంగా బల నిరూపణ అంత సులువు కాదు. అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచన ఉంటే రాజీనామా ఆమోదించాలని ఒత్తిడి తేవచ్చు. ఈక్రమంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. అందులో అన్ని సీట్లలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ గెలవడం అసాధ్యం. ఫలితంగా బీజేపీకి లాభం. అయితే వారు బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే కొందరికి కేబినెట్‌ బెర్తులు ఇవ్వాల్సి ఉంది. ఎవరికి ఇవ్వాలనే దానిపై సతమతం అవుతున్నారు. సొంత పార్టీలో ఉన్న సీనియర్‌ నేతలే మంత్రి పదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

యడ్యూరప్ప నివాసంలో కీలక భేటీ
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో బీజేఎల్పీ నేత బీఎస్‌ యడ్యూరప్ప నివాసంలో బుధవారం ఉదయం పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మురళీధరరావు, జగదీశ్‌ శెట్టర్, ఆర్‌.అశోక్, మాధుస్వామి, బసవరాజు బొమ్మయి, ఎంపీ రేణుకాచార్య, వి.సోమణ్ణ, చంద్రప్ప, హాలప్ప తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బల పరీక్ష గురించి చర్చించారు. కాగా కేబినెట్‌ రేసులో బెంగళూరు నేతలు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి బయటికి వచ్చిన గోపాలయ్య, విశ్వనాథ్, భైరతి బసవరాజు, మునిరత్న, ఎస్‌టీ సోమశేఖర్, బీజేపీ నుంచి ఆర్‌.అశోక్, వి.సోమణ్ణ, అశ్వత్‌నారాయణ్, ఎస్‌ఆర్‌ విశ్వనాథ్, సతీష్‌రెడ్డి కేబినెట్‌ బెర్తు ఆశిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా బి.శ్రీరాములు, జేసీ మాధుస్వామి, ఆనందసింగ్, ఎ.రామదాస్, కేఎస్‌ ఈశ్వరప్ప, ఎస్‌ఏ రవీంద్రనాథ్, బీసీ పాటిల్, శంకర్‌పటేల్, కేజే బోపయ్య, ప్రతాప్‌గౌడపాటిల్‌ తదితరులు కేబినెట్‌ బెర్తుపై కన్నేసినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement