తమ ఎమ్మెల్యేకు యడ్యూరప్ప రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చారని సీఎం కుమారస్వామి బడ్జెట్‌కు ముందు ఆడియో టేపులు విడుదల చేయగా, అవి నకిలీవని, ఆయన రికార్డింగ్ అనుభవంతో వాటిని తయారు చేసి ఉంటారని యడ్డి మండిపడ్డారు. ఇందులో స్పీకర్ మీద కూడా ఆరోపణలు రావడం గమనార్హం.
సాక్షి బెంగళూరు: జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసినట్లు సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో రికార్డులు నకిలీవని ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. శుక్రవారం ఆయన విధానసౌధ వద్ద మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపిస్తున్న సీఎం కుమారస్వామి రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘రాజీనామా చేసి వచ్చెయ్.. సభాధ్యక్షునితో నేను మాట్లాడుతా’ అని తాను ప్రలోభపెట్టినట్లు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. సభాపతి పదవిని సీఎం కుమారస్వామి అగౌరవ పరుస్తున్నారని విమర్శించారు. నకిలీ ఆడియో రికార్డులతో రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని, సీఎం కుమారస్వామి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. దేవదుర్గకు హెలికాప్టర్‌లో వెళ్లి వచ్చానని చెప్పారు. అంతేకానీ తాను ఎవరితో మాట్లాడలేదని చెప్పారు.
ఆయన సినిమా రికార్డింగులు చేసిన వ్యక్తి
‘ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సినిమా వ్యక్తి. ఆయన ఎన్నో సినిమాలు నిర్మి ంచారు. రికార్డింగులు చేయించారు. ఈక్రమంలో ఈ రికార్డింగు కూడా అలాంటిదే’ అని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్‌నే సీఎం కుమారస్వామి ప్రలోభపెట్టారన్నారు. జేడీఎస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్– జేడీఎస్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు ముఖం చాటేశారని, వీరిలో ఎంతమంది సర్కారుకు మద్దతు ఇస్తారో లేదో తెలియదన్నారు.
కుమార ఆఫర్ ఇచ్చారు: సుభాష్ గుత్తేదార్
సీఎం కుమారస్వామి తనకు భారీ ఆఫర్ ప్రకటించారని ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఆరోపించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్‌లో బెర్తుతో పాటు తనకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని కుమారస్వామి ఆఫర్ ఇచ్చారన్నారు. తాను ఏ పార్టీలోకి మారనని స్పష్టం చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment