సాక్షి, బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తరచూగా ఆలయాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల సందర్భంగా రాహుల్ ‘టెంపుల్ రన్’ ప్రధానంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల రాష్ట్రమైన కర్ణాటకలోనూ రాహుల్ ఆలయాలను దర్శించుకుంటుండటంతో బీజేపీ.. ఆయనను ‘ఎన్నికల హిందువు’గా అభివర్ణిస్తోంది. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించుకోవడం ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తోంది. తాజాగా ఆయన ’జవారీ చికెన్’ తినిమరీ ఆలయానికి వెళ్లారని కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తాజాగా ఆరోపించారు.
‘ఒకవైపు టెన్ పర్సెంట్ సీఎం సిద్దరామయ్య చేపల కూర తిని.. ధర్మస్థల మంజునాథుడిని దర్శించుకుంటే.. మరోవైపు ఎన్నికల హిందువు అయిన రాహుల్‌గాంధీ జవారీ చికెన్ తిని నరసింహస్వామిని దర్శించుకున్నారు’ అని యడ్యూరప్ప ట్వీటర్‌లో విమర్శించారు. ‘హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాయపరుస్తోంది? ఆ పార్టీది సమాజవాదం కన్నా మజావాదం( ఎంజాయ్ చేయడం) ఎక్కువ కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. రాహుల్ నరసింహస్వామిని దర్శించుకున్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. గత ఏడాది చేపల కూరతో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం సీఎం సిద్దరామయ్య మంజునాథ ఆలయాన్ని దర్శించుకోవడం వివాదానికి దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment