
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో ధైర్యమైన ముందడుగు వేయనున్నారు. నోయిడాలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. అందులోకి అడుగుపెట్టడానికి ధైర్యం దేనికి, అక్కడికి వెళితే తప్పేమిటని అనుకుంటున్నారా? మరేం లేదు. నోయిడాకు శాటిలైట్ సిటీ అని పేరున్నప్పటికీ శాపగ్రస్త నగరం అని కూడా మరో పేరుంది. అక్కడ అడుగు పెట్టిన ఏ పాలకుడు కూడా తిరిగి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రారంట. గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 2011లో నోయిడాకు వెళ్లి రూ.685కోట్ల విలువైన మెమోరియల్ పార్కుకు శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆమె అధికారంలోకి రాలేదు. ఎంత ప్రయత్నించినా అంతకంతకు ఆమె పార్టీ మరింత మసకబారిందే తప్ప అస్సలు ముందుకెళ్లలేదు.
దీంతో ఆ తర్వాత వచ్చిన సీఎం అఖిలేశ్ ఆ శాపం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లేందుకు భయపడ్డారు. ఆ ఆలోచన మానుకున్నారు. అయినప్పటికీ అధికారం కోల్పోయారు. అయితే, సీఎం యోగి మాత్రం అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా నోయిడా-కల్‌కాజీ మెట్రోలైన్ ప్రారంభోత్సవానికి ఆయన ఈ నెల 25న నోయిడాలో అడుగుపెడుతున్నారు. అక్కడే ఆయన ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికి సంయుక్తంగా మెట్రోను ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని నోయిడా జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, మొత్తం 75 జిల్లాల్లో తాను పర్యటిస్తానని శాంతిభద్రతలు పర్యవేక్షించే యోచన చేస్తున్నారని, అందుకోసం ప్రాధాన్య జిల్లాలను పరిశీలించారని, వాటిలో మాత్రం నోయిడాకు ప్రాధాన్యం ఇవ్వలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కాగా, తమ ముఖ్యమంత్రి యోగి మంత్రశక్తులు, శాపాలు వంటివాటిని నమ్మరని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment