ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వద్దని.. ప్యాకేజీ తీసుకుని మనల్నందర్నీ మోసం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు సభలో ఇదే విషయం చెప్పారు. ప్రత్యేక హోదాపై ఆది నుంచి చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నది మీరొక్కరే. హోదాతోనే మా బతుకు, శ్వాస. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చంద్రబాబు కొంప ముంచారు. ఉపాధి లేదు.. నిరుద్యోగ భృతీ లేదు. అందుకే ప్రత్యేక హోదా కోసం మీరిచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగే బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాం. హోదా హోరు ఢిల్లీకి, చంద్రబాబుకు వినిపించేలా నినదిస్తాం’ అని పలువురు యువకులు, విద్యార్థులు వైఎస్ జగన్‌తో అన్నారు. ‘పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా అనివార్యమని చెప్పిన ఈ పెద్దమనిషే (చంద్రబాబు) ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి మొగ్గుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన చందంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే. దానిని సాధించి తీరాల్సిందే.
అది మీతోనే సాకారమవుతుంది. బంద్‌ను జయప్రదం చేసి తీరతాం’ అని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో సోమవారం 219వ రోజు అడుగడుగునా కనిపించిన దశ్యాలివి. హోదాపై చంద్రబాబు మాటమార్చారని మండిపడుతున్న ప్రజలు పాదయాత్ర చేస్తూ వచ్చిన జగన్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం జరగనున్న రాష్ట్ర బంద్‌కు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. ఇలా మద్దతు తెలిపిన వారిలో కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, జర్నలిస్టు.. తదితర ప్రజా సంఘాలు, రాష్ట్రాభివద్ధిని కాంక్షిస్తున్న మేధావులు, స్వచ్ఛంద సంస్థల వారున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం ఉండూరు నుంచి సోమవారం ఉదయం ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర సాయంత్రం గణపతినగర్‌లో ముగిసింది. దారి పొడవునా మేళతాళాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన ప్రజలు అదే స్థాయిలో తమ సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. అడుగు ముందుకు పడనీయకుండా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు సెల్ఫీల కోసం, కరచాలనం చేయడానికి పెద్దఎత్తున పోటీపడ్డారు.
అందరినోటా అదేమాట..
దారిపొడవునా జగన్‌కు సమస్యలు చెప్పుకున్న వారిలో అత్యధిక శాతం చంద్రబాబు సర్కారు బాధితులే. రేషన్‌కార్డులు, పింఛన్లు తీసేశారని, ఇళ్లు ఇవ్వడం లేదని జగన్ దృష్టికి తెచ్చారు. బాబొస్తే జాబొస్తుందన్నది బూటకమని తేలిందన్నా.. ఇక ఈ మోసాన్ని భరించలేమంటూ ఎంబీఏ, ఎంసీఏ చదివిన పలువురు నిరుద్యోగులు జగన్ ఎదుట వాపోయారు. ప్రత్యేక హోదా వస్తేనన్నా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే ఈ బాబు దాన్నీ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రధానమంత్రే ఈ విషయాన్ని చెప్పి బాబు బండారాన్ని బయటపెట్టిన తర్వాత ఇక ఈ వ్యక్తిని క్షమించే ప్రసక్తే లేదన్నారు. బాబుకు జ్ఞానోదయం అయ్యేలా నేటి బంద్‌లో నినదిస్తామన్నారు. బాబు రుణమాఫీ హామీని నమ్మి నట్టేట మునిగామని సామర్లకోట సవర గ్రామస్తులు జగన్‌కు ఫిర్యాదు చేశారు.
పంట రుణాలు మాఫీ అవుతాయన్న భావనతో బ్యాంకులకు అప్పులు చెల్లించకపోవడంతో ఇప్పుడు అసలు, వడ్డీ రెండూ కలిపి కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పంట రుణం రాకపోగా చివరకు ఆనవాయితీగా వచ్చే పావలా వడ్డీ పథకం కూడా వర్తించకుండా పోయిందని వివరించారు. రైతుల్నే కాక సహకార సంఘాలను కూడా బాబు మోసం చేశారన్నారు. చంద్రబాబుకు వ్యాపారులపై ఉన్న ప్రేమ వ్యవసాయదారులపై లేకపోయిందన్నారు. నాలుగేళ్ల కిందట వచ్చిన వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) అందలేదని పెద్దాపురం నియోజకవర్గ రైతులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఎకరాకు రూ.4 వేల చొప్పున మంజూరైనట్టు రెవెన్యూ అధికారులు చెప్పారని, బ్యాంకు ఖాతాలు కూడా తెరిచామని అయినా అతీగతీ లేదన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల గోస..
మా కష్టాలు పగోడికి కూడా రాకూడదయ్యా, సొమ్మూ పోయి శని పట్టడమంటే ఇదేనయ్యా అంటూ అగ్రిగోల్డ్ బాధితులు కుమిలిపోయారు. జనం సొమ్ము దండుకున్న వారు జల్సాలు చేస్తుంటే తాము మాత్రం పూటకో రీతిగా ఇక్కట్లు పడాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. సామర్లకోట పట్టణంలో వైఎస్ జగన్‌ను కలిసిన పెద్దాపురం నియోజకవర్గ అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో దీనగాధను వివరించారు. చంద్రబాబుకు ఈ విషయాన్ని వివరించడానికి వెళితే పోలీసుల్ని తమపైకి ఉసిగొలుపుతున్నారని వాపోయారు. చివరకు తమకు ఆత్మహత్యలే గతి అని చెప్పినప్పుడు జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే ఈ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పచ్చటి పొలాలు, చిత్తడి రహదారులు దాటి సామర్లకోట పట్టణంలోకి ప్రవేశించినప్పుడు వైఎస్ జగన్‌కు ప్రజలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. కిలోమీటరు మేర యాత్ర సాగడానికి రెండు గంటల సమయం పట్టిందంటే జనాభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాళ్లరిగేలా తిరిగినా ఇల్లు ఇవ్వలేదు
అన్నా.. మేము సామర్లకోటలో 17వ వార్డులో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త దుర్గ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంపాదన అంతంతమాత్రం కావడంతో ప్రభుత్వ సాయంపై ఆశలు పెరిగాయి. పట్టణంలో రాజీవ్ గృహ కల్ప, త్రిబుల్ బెడ్ రూం ఇళ్లు, కాలనీ స్థలాల కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాం. వాటిలో ఎక్కడా కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. వార్డు కౌన్సిలర్, అధికారులు పట్టించుకోలేదు.
– సామర్లకోటలో జగన్‌తో సమ్మింగి నాగమణి
వైఎస్సార్ పుణ్యమా అని బతికాను
అయ్యా.. మీ నాన్నగారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతకగలిగాను.. తొమ్మిదేళ్ల క్రితం గుండె జబ్బు వచ్చింది. చాలా ఖర్చు అవుతుంది.. ఆపరేషన్ చేయించుకోకపోతే బతకడం కష్టం అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎవరో చెబితే కాకినాడ అపోలో ఆస్పత్రికి వెళ్లాను. రూ.1.50 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఈ పథకం కింద ఉచితంగా చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆ మహానుభావుడు లేరు. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.. మీరు చల్లగా ఉండాలి.. మీకు అంతా మంచే జరగుతుంది.
– ఉండూరు వద్ద జగన్‌తో జ్యోతుల చక్రం
జగన్ వస్తేనే న్యాయం జరుగుతుంది..
నా బిడ్డ కర్రి లక్ష్మణబాబు పుట్టుకతోనే పోలియే బారినపడ్డాడు. రెండు కాళ్లు దెబ్బతినడంతో నడవలేడు. ఎక్కడికి వెళ్లాలన్నా నేనే ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాను. ఉండూరు జెడ్పీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కాళ్లకు మూడుసార్లు ఆపరేషన్ చేయించాం. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా బిడ్డకు పింఛను డబ్బులు పెంచుతానని చెప్పారు. జగన్ వస్తేనే అందరికీ మేలు జరుగుతుంది.
– వెంకటేశ్వరరావు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ
పిఠాపురం: తమ ప్రభుత్వం రాగానే అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాక పక్కా ఇళ్లను కట్టిస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట వద్ద పాదయాత్రలో ఉన్న జగన్‌ను సోమవారం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు స్వాతిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు పాత్రికేయులు కలిసి తమ సమస్యలను వివరించారు. ‘మూడు పడక గదుల ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. దశాబ్దాల తరబడి ఇదే వృత్తిపై జీవిస్తున్న ఎంతో మంది జర్నలిస్టులు చాలీచాలని ఆదాయంతో, అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. మీరు ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల పథకాలు పేదలకు ఎంతో ఉపయోగకరం. అదే రీతిలో జర్నలిస్టుల సమస్యలపై కూడా స్పందించాలని కోరుతున్నాం.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించడం, అన్ని వ్యాధులకు వర్తించేలా ఆరోగ్య బీమా, విద్యా సంస్థల్లో పిల్లలకు ఉచిత విద్య, జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, పింఛను సదుపాయం, వడ్డీలేని బ్యాంకు రుణాలు, వృత్తిపరమైన భద్రత కల్పించాలి’ అని కోరారు. సమస్యలను సావధానంగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో జర్నలిస్టుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జగన్‌ను కలిసిన వారిలో సంఘం నేతలు రాకుర్తి రాంబాబు, అడపా వెంకట్రావు, బూరాడ శ్రీనివాసరావు, వెంకట్, వర్మ, ఆలీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment