మాట్లాడుతున్న వైఎస్ అవినాష్‌రెడ్డి, చిత్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు
సాక్షి, కడప: కష్టాలెదురైనా......నష్టాలు ఎదురైనా నా వెన్నంటి ఉంటున్నారు. అన్నింటినీ భరించి అండగా ఉంటున్నారు. దశాబ్దాల కాలంపాటు నాన్నను...చిన్నాన్నను...కుటుంబాన్ని ఆదరించారు. మంచి, మానవత్వానికి...ధీరత్వానికి...గుండె నిబ్బరానికి....పదిమందికి సాయం చేసే గుణం నేర్పిన ఈ గడ్డను ఎప్పటికీ మరిచిపోను...అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటా...పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
శుక్రవారం మధ్యాహ్నం పులివెందులలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సీఎస్‌ఐ మైదానంలో అశేష జనవాహనినుద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. చంద్రబాబు నైజాన్ని...మోసాన్ని, అబద్ధా్దలను ఎండగడుతూనే....మరో పక్క పులివెందుల గడ్డ తనకు...మంచితనం, మానవత్వం పంచిన వైనాన్ని వివరించారు. ఎన్ని జన్మలెత్తినా ఈ గడ్డ రుణం తీర్చుకోలేమన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ది పనులను వివరించారు. తర్వాత ప్రభుత్వాలు విస్మరించిన వైనాన్ని ఎండగట్టారు. ఇలా ప్రతి అడుగులోనూ తోడు నీడగా నిలిచిన ప్రజలను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇసుక వేస్తే రాలనంత జనం
పులివెందుల శుక్రవారం జనసంద్రంగా మారింది. అడుగులో అడుగై......పల్లెలు, పట్టణాలు...చిన్నా పెద్ద తేడా లేకుండా కదలివచ్చిన జనంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మైదానంతోపాటు రోడ్లపై జెండాలు చేతబూని చేస్తున్న నినాదాలతో హోరెత్తింది. వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడింది. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ వైఎస్సార్ హయాం నుంచి నామినేషన్‌కు ముందు సీఎస్‌ఐ మైదానంలో బహిరంగసభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్‌తోపాటు ప్రచారరథంపై మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, రిటైర్డ్ ఓఎస్‌డీ చంద్రశేఖర్‌రెడ్డిలు ఉన్నారు.
దివంగత వైఎస్ వివేకాకు నివాళి
హైదరాబాదు నుంచి విమానంలో కడపకు చేరుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్కడి నుంచి పులివెందులకు వచ్చారు. సీఎస్‌ఐ మైదానానికి రాగానే హోరెత్తుతున్న నినాదాల మధ్య అడుగు పెట్టారు. సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్, వైఎస్ వివేకాల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకా మృతికి వైఎస్ జగన్, కడప పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిలు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరగా అందరూ మౌనం పాటించి నివాళులర్పించారు.
అందరికీ అభివాదం చేస్తూ
నామినేషన్ వేసేందుకు పులివెందులకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి అందరితో కలుపుగోలుగా ముందుకు వెళ్లారు. వచ్చిన ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ....ప్రచార రథం పైనుంచి....వాహనంలో నుంచి వెళుతూ అందరికీ అభివాదం చేస్తూ కదిలారు. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతి మాటకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. జగన్‌కు జనాలు చేతులెత్తి కేరింతలు కొడుతూనే హర్షధ్వానాల ద్వారా తమ అభిమతాన్ని తెలియజేశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ సందర్బాన్ని పురస్కరించుకుని శుక్రవారం భాకరాపురంలో ఉన్న ఇంటిలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు, తల్లి వైఎస్ విజయమ్మ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరి వెళ్లారు.
పులివెందులలో నామినేషన్
పులివెందులలోని తహసీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి మినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.49 గంటలకు రిటర్నింగ్ అధికారి సత్యంకు ప్రతిపక్ష నేత నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుమునుపు వైఎస్ జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాల ప్రక్రియను పూర్తి చేసి అందజేశారు. ఆయనతోపాటు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment