సమర శంఖారావం సభ ఏర్పాట్లు చేస్తున్న ఆర్‌కే టీఎం సభ్యులతో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : టీడీపీ పాలనలో వైఎస్‌ఆర్ జిల్లాకు ఒరిగింది శూన్యమని, మేలు కలిగించేలా చేసిన ఒక గొప్ప పని ఏమిటో చెప్పాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా ప్రజల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ నిర్వహించిన అలుపెరుగని పోరాటాలు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 మాసాలపాటు చేసిన సుదీర్ఘ పాదయాత్రే తమను గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులకు నీళ్లిచ్చామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నా వాస్తవానికి వారు లస్కర్‌లా గేట్లు ఎత్తడం మాత్రమే చేశారని ఎద్దేవా చేశారు. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను44వేల క్యూసెక్కులకు పెంచుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే నేడు గండికోటకు, సీబీఆర్, పైడిపాళెం ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, కాలువలు, పైపులైన్లు, పంప్‌హౌస్‌లు అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవేనన్నారు. వైఎస్‌ఆర్ జీవించి ఉంటే 2010లోనే ఇంతకంటే ఎక్కువ నీరు పులివెందులకు వచ్చేవన్నారు.
ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల తొమ్మిదేళ్లపాటు నత్త నడకన సాగిన ఈ పనులు ఈనాటికి పూర్తయితే కొద్దొ గొప్పొ నీళ్లు వస్తున్నాయన్నారు. ఇప్పటికీ పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కావలసి ఉందన్నారు. పులివెందులలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నది వైఎస్‌ఆర్ కల అన్నారు. ప్రజలు వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే ఆ పనులు పూర్తి చేసి ఆయనకల నెరవేరుస్తామన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోనే ముదిగుబ్బ, కదిరిలకు బ్రహ్మాండమైన రహదారులు నిర్మించారని, పులివెందులకు రింగురోడ్డు, శిల్పారామం, జేఎన్‌టీయూ, స్పిన్నింగ్ మిల్స్, ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్, ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి అభివృద్దిని పరుగులు పెట్టించారన్నారు. టీడీపీ పాలనలో ఇలాంటి పనులు ఒక్కటైనా చేశారేమో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఈ స్థాయి అభివృద్ది జరగాలంటే వైఎస్‌ఆర్‌లాంటి పాలన రావాలన్నారు. పులివెందుల్లో గెలుస్తామని టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, అది ఎన్నటికీ నెరవేరదన్నారు. పులివెందులలో గతం కంటే రెట్టింపు స్థాయిలో తమ బలం పెరిగిందని, వైఎస్ జగన్ 14 నెలల పాదయాత్ర చూశాక ఒక ముఖ్యమంత్రిని గెలిపిస్తున్నామన్న భావనలో పులివెందుల ప్రజలు ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment