పిట్టల దొరా.. ఇక కథలు ఆపు  | Ys jagan blames on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

పిట్టల దొరా.. ఇక కథలు ఆపు 

Published Fri, Dec 7 2018 1:47 AM | Last Updated on Fri, Dec 7 2018 4:53 AM

Ys jagan blames on ap cm chandrababu - Sakshi

ఈ పెద్దమనిషి మాటమాటకూఅంటుంటాడు.. తానే సెల్‌ ఫోన్, కంప్యూటర్‌ కనిపెట్టానని. మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈవో సత్య నాదేళ్లకు ఈయనే కంప్యూటర్‌ కొట్టడం నేర్పించారట. సింధూకు బ్యాడ్మింటన్‌  కూడా ఈయనే నేర్పించారట. హైదరాబాద్‌కు ఈయనే ఐటీ తెచ్చాడట. ఇలా పిట్టల దొరలా కథలు చెబుతా ఉంటే నిజంగా ఈ మనిషిని ఏమనాలి? ఏదైనా చేస్తాను అని చెప్పి చేయకపోతే మంచి మనిషి అయితే ప్రజల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలి. చేస్తాను అని చెప్పాను.. చేయలేక పోయాను.. అందుకు నన్ను క్షమించండి అని అడగాలి. కానీ ఈ పెద్దమనిషి నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు, అవినీతి, అన్యాయం.  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  చంద్రబాబు నాయుడు పిట్టలదొర మాదిరిగా కథలు చెబుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నట్టుగా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మకాం వేసి ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. శవాలపై చిల్లర ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 314వ రోజు గురువారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెం కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరించి మొత్తం హైదరాబాద్‌నంతా తానే అభివృద్ధి చేసినట్టు బాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు జరగదని, ఈ అన్యాయమైన ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కళా వెంకట్రావ్‌ పెద్ద బ్రోకర్‌గా తయారయ్యారని ధ్వజమెత్తారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా  ఏమన్నారంటే.. 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఆయనే కట్టాడట. 
‘‘రాష్ట్రంలో ప్రజలను గాలికొదిలేసి, ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించడానికి డ్రామాలాడుతున్నాడు. పిట్టల దొరలా కథలు చెబుతున్నారు. తెలంగాణాలో ఎన్నికలొస్తే అదేదో ఈయన సొంత రాష్ట్రంలో ఎన్నికలొచ్చినట్టు హంగామా చేస్తూ డ్రామాలాడుతున్నారు. ఈయన మాటలు, డ్రామాలు చూస్తుంటే ఇంతకంటే అన్యాయమైన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరేమోననిపిస్తోంది. తెలంగాణకు వెళ్లి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా అబద్ధాలు చెప్పారు. తెలంగాణలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఆయనే కట్టాడట. హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆయనే వేశారట.. అయ్యా చంద్రబాబూ.. ఎప్పుడైనా అబద్ధాలు చెప్పేటప్పుడు ప్రజలకు ఏమి తెలియదనుకుంటావా? లేక ప్రజల చెవుల్లో నువ్వు ఏ పువ్వులు పెట్టినా పడి ఉంటాయనుకుంటావా? శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు 2005 మార్చిలో పనులు ప్రారంభమై 2008 మార్చిలో పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయింది డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో కాదా? రింగ్‌ రోడ్డు పనులు 2005 డిసెంబర్‌లో మొదలయ్యాయి. ఆ పనులు పూర్తయింది ఆ దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆ పక్కనే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే ఉంది. 11 కిలోమీటర్ల పొడవున్న ఆ ఫ్లైఓవర్‌ ఆసియాలోనే అతి పెద్దది. దానికి శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాదా? ఇవన్నీ తాను చేశాడు కాబట్టే.. ఎయిర్‌ పోర్టుకు నేరుగా వెళ్లే దారులు, రింగ్‌రోడ్డు రావడం కారణంగానే.. హైదరాబాద్‌లో ఐటీ రంగం ఉరుకులు పరుగులు తీసింది. డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో ఇవన్నీ వచ్చాయి కాబట్టే ఐటీ ఓ వెలుగు వెలిగింది. ఇది నిజం కాదా? 

దమ్మిడీ ఇవ్వలేదు.. 
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఇంత దారుణంగా ఉంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు ప్రజల గురించి పట్టించుకోడు. తెలంగాణలో ఎన్నికలంటూ తిరుగుతున్నారు. తిత్లీ తుపాను వచ్చి ఈ ఎచ్చెర్ల మండలంలో దాదాపుగా 1,200 ఎకరాలు నష్టపోతే చంద్రబాబు ప్రభుత్వం 400 ఎకరాలకు కుదించిన పరిస్థితిని చూస్తున్నాం. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా తుపాను బా«ధితులను కాపాడాలని చూస్తాడు. తుపాను రాకమునుపే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. పక్కన ఒడిశా రాష్ట్రంలో ఇవి కనిపిస్తాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం కనిపించవు. తిత్లీ తుపాను వల్ల అక్షరాలా 3,435 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఇదే పెద్దమనిషి కేంద్ర ప్రభుత్వానికి, స్వయంగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాశాడు. అయితే ఈ పెద్ద మనిషి మంజూరు చేసింది అందులో 15 శాతం.. అంటే రూ.520 కోట్లు మాత్రమే. సిగ్గుతో తలదించుకోవాల్సిన పనిలేదా? పైగా భారీగా ఆదుకున్నట్లు ప్రచారం. రాష్ట్రంలో ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఏడింట అంత్యంత తీవ్ర కరవు ఉంది. మరో నాలుగు జిల్లాలలో తీవ్ర కరవు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ నుంచి ఇప్పటి వరకు మైనస్‌ 35 శాతం వర్షపాతం లోటు ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్‌ పోయింది. రబీ పోయింది. అయినా ముఖ్యమంత్రి అనే వ్యక్తి పట్టించుకున్న పాపాన పోలేదు. ఖరీఫ్‌ పంటకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.2 వేల కోట్లు ఇవ్వాలని తేలిస్తే ఇంతవరకు దమ్మిడీ ఇవ్వలేదు.  

ఈ మంత్రికి మరో మూడు పేర్లు.. 
ఈ జిల్లాలో 10 స్థానాలుంటే తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు ఇచ్చామన్నాÆ.. ఇవి సరిపోవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొనుగోలు చేసి ఎనిమిది మందిని పక్కన బెట్టుకుని జిల్లాకు, మా ప్రాంతానికి చేసిందేమిటన్నా అని ఈ నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాయన పేరు కళా వెంకట్రావు. ఈయన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయడం లేదని చెబుతున్నారు. కానీ చంద్రబాబును బాగా కాకాలు పడుతూ కాకాల వెంకట్రావు అనే పేరు కూడా ఉందన్నా అంటున్నారు. కమీషన్‌ల వెంకట్రావు అనే పేరు కూడా ఉందట. ఈ రెండు పేర్లే కాదన్నా.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదాంట్లో చంద్రబాబు తరఫున బేరాలాడిన బ్రోకర్‌ వెంకట్రావు అని మూడో పేరుందని కూడా చెబుతున్నారు. ఈయన మంత్రి అయ్యాక ప్రజలకు చేసిందేమీ లేదన్నా అని చెబుతున్నారు. కానీ ఈయన కొడుకు రణస్థలం మండలం నారువాలో ఎకరా రూ.50 లక్షలు విలువచేసే భూములను ఎకరా రెండు లక్షలకే కొట్టేశాడన్నా.. నాలుగు కోట్ల విలువచేసే భూమిని 15 లక్షలకే కొట్టేశాడన్నా. కానీ ఆ భూముల్లో మాత్రం పరిశ్రమలు రాలేదన్నా.. సిగడాం, లావేరు మండలాల్లో ఏ పని జరిగినా కళా బావమర్దికే వర్కులన్నీ పోతుంటాయన్నా.. కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం కోసం సేకరించిన భూముల్లో ప్రభుత్వ భూములను తమవిగా చూపించి ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు రూ.30 కోట్లు నొక్కేశారన్నా అని ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తున్నారు. 

ట్రిపుల్‌ ఐటీ నిర్వహణ అధ్వానం 
ఇదే నియోజకవర్గంలో ఉన్న అంబేడ్కర్‌ యూనివర్సిటీ నాన్నగారి చలవేనని ప్రజలు చెప్పుకొచ్చారు. ఇవాళ చంద్రబాబు ఈ యూనివర్సిటీని పూర్తిగా నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడన్నా అని చెప్పారు. ఈ యూనివర్సిటీలో పోస్టులు భర్తీ చేయరు.. స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయరు.. వసతులు కల్పించరు.. యూనివర్సిటీలో 16 డిపార్టుమెంట్లలో 94 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా అందులో 12 మంది మాత్రమే రెగ్యులర్‌.. మిగిలిన 84 మందిని కాంట్రాక్ట్‌ అధ్యాపకులన్నా.. అని చెప్పుకొచ్చారు. ఇదే యూనివర్సిటీలో నెస్ట్‌ కానీ, సెట్‌ కానీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక సెల్‌ కూడా లేదన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన సరిగా లేదని, సకాలంలో పట్టాలు కూడా ఇవ్వడం లేదన్నా.. అని చెప్పుకొచ్చారు. నాన్నగారు పెట్టిన ట్రిపుల్‌ ఐటీకి దేశంలోనే పేరుందన్నా..  దీనిని చంద్రబాబు రోడ్డుమీదకు తీసుకువచ్చాడన్నా అని ఇక్కడి ప్రజలు, విద్యార్థులు చెబుతున్నారు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు 2016లో ట్రిపుల్‌ ఐటీకి శ్రీకాకుళం జిల్లాలో మంజూరు చేస్తే ఇంతవరకు ఒక్క బిల్డింగ్‌ కట్టడానికి కనీసం ఒక్క ఇటుక కూడా పెట్ట లేదన్నా అని చెబుతున్నారు. ఇక్కడి పిల్లలను నూజివీడు తీసుకుపోయి ట్రిపుల్‌ ఐటీలో చేర్పించే కార్యక్రమం చేశారన్నా అని చెప్పుకొచ్చారు. చివరకు రెండో సంవత్సరం నూజివీడులో ఉన్న వెయ్యి మంది శ్రీకాకుళం జిల్లా పిల్లలను శ్రీకాకుళం జిల్లాకు వెనక్కు తీసుకువచ్చి.. కొంతమంది పిల్లలను భూతపట్నం ఇంజనీరింగ్‌ కాలేజీలో, మరికొంత మందిని గురుకుల పాఠశాల భవనాల్లో పెట్టి చదువులు చెబుతున్నారన్నా అని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక మా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 34 స్కూళ్లను మూసేశాడన్నా.. ఎచ్చెర్లలో 11 స్కూళ్లు, రణస్థలంలో 16 స్కూళ్లు, సిగడాంలో ఒక స్కూలు, లావేరులో ఆరు స్కూళ్లు మూసేయించారన్నా.. ఇదే ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఐదు ఎస్సీ హాస్టళ్లను కూడా మూసేయించారన్నా.. అని పిల్లలు చెప్పుకొచ్చారు. 
 
తోటపల్లి ప్రాజెక్టు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 
 తోటపల్లి ప్రాజెక్టు గురించి ఏనాడూ ఆలోచించని ఈ పెద్దమనిషి ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని, మమ్మల్ని మళ్లీ మోసం చేయాలని టెంకాయ కొట్టి పోయాడన్నా.. అని రైతులు చెప్పారు. నారాణయపురం ఆనకట్ట శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే లేడన్నా అని చెప్పుకొస్తున్నారు. మడ్డువలస ప్రాజెక్టు ఫేజ్‌ –2 కింద కుడి ప్రధాన కాలువలను విస్తరించి రెండు ఉప కాలువల ద్వారా అదనంగా 12,500 ఎకరాలకు సాగునీరివ్వాలని రాజశేఖరరెడ్డి గారు రూ.48 కోట్లు మంజూరు చేశారన్నా.. నాన్నగారు బతికున్నప్పుడే రూ.48 కోట్లకు గాను రూ.28 కోట్ల విలువైన పనులు చేశారన్నా.. ఆ తర్వాత నాన్నగారు  మరణించడంతో ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నా అని చెప్పారు.
  
 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం 
పైడి భీమవరం పారిశ్రామికవాడలో చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఏడు మూతపడ్డాయి. ఉన్న పరిశ్రమల్లో కూడా పొరుగు రాష్ట్రం, పొరుగు జిల్లా వాళ్లకే ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకు 20 శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. రేపు మన ప్రభుత్వం రాగానే మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక చట్టాన్ని తీసుకువస్తాం. ఆ చట్టం మేరకు ఉన్న పరిశ్రమల్లో కానీ, కొత్త పరిశ్రమల్లో కానీ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా రిజర్వేషన్‌లు తీసుకొస్తాం. చేనేతల పరిస్థితి దయనీయంగా ఉంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్కో కింద చేనేత సొసైటీలకు రావాల్సిన రూ.209 కోట్ల బకాయిలు 12 నెలలుగా ఇవ్వలేదు. ఇదే జిల్లాలో 44 చేనేత సొసైటీలుంటే కేవలం 13 సొసైటీలే పని చేస్తున్నాయి.  

ఇలాంటి దుర్మార్గపు పాలన అవసరమా? 
రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ కాక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మీ ఇంటికి వచ్చిందా? ఆ పెద్దమనిషి చేస్తానన్న రుణమాఫీ పథకం రైతులకు కనీసం వడ్డీలకైనా సరిపోయిందా?  ఇవాళ సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేవు.  పోలవరం ప్రాజెక్టు  పునాదులు దాటని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్‌ ధరలు, ఇంటిపన్నులు, స్కూలు ఫీజులు, కళాశాల ఫీజులు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. పక్కనే జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఉంది. లక్షా 4 వేల రూపాయల ఫీజు. పిల్లలు ఎలా చెల్లించాలి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.30 వేలు.. రూ.35 వేలు. నాలుగేళ్లకు గాను మిగతా రూ.3 లక్షల కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీల మాఫియా. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదు. గ్రామ గ్రామాన, వీధి వీధినా బెల్ట్‌ షాపులే. ఈ పాలన∙పోవాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాల్లో భాగంగా ప్రతి అవ్వా తాత పింఛన్‌ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాను. ప్రతి నెల రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాను. మీ బిడ్డను ఆశీర్వదించండని కోరుతున్నా’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

మత్స్యకార సోదరులను విడిపిస్తాం
ఇవాళ ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు, వారి కుటుంబ సభ్యులు నా దగ్గరకొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. నిజంగా పనులు దొరక్క వలసపోతున్న పరిస్థితి. రూ.8 వేల కోసం ఏకంగా గుజరాత్‌ దాకా పోతున్న పరిస్థితి. అక్కడ వీరి బోటు తెలియక పాకిస్తాన్‌ సరిహద్దులోకి పోయిందని ఆ దేశ నేవీ వాళ్లు వచ్చి అరెస్టు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ నేను ప్రతి మత్స్యకార సోదరుడికి భరోసా ఇచ్చి చెబుతున్నా... కచ్చితంగా మా రాజ్యసభ సభ్యులు ఇద్దరినీ ఇచ్చి మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి దగ్గరకు పంపుతా. వాళ్లకు పరిస్థితి వివరించి మత్స్యకారులను పాకిస్తాన్‌ నుంచి తిరిగి వెనక్కు తీసుకువచ్చేటట్టు చేస్తానని హామీ ఇస్తున్నా. అక్కడ అరెస్ట్‌ అయిన 23 మందిలో ఈ నియోజకవర్గం వారు 13 మంది. ఏ పాపం తెలియక అరెస్ట్‌ అయిన వీరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది.  

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమిటో తెలుసా? హైదరాబాద్‌లోని ఆల్విన్‌ కంపెనీ, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ కంపెనీ, నిజాం షుగర్స్‌ కంపెనీ, పాలేరు షుగర్స్‌ కంపెనీ, అదిలాబాద్‌ స్పిన్నింగ్‌ మిల్లు, సిర్పూర్‌పేపర్‌ మిల్లు, నంద్యాల, ఆమదాలవలస, హనుమాన్‌ జంక్షన్, బొబ్బిలి, కోవూరు తదితర ప్రాంతాల్లోని సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నీ అమ్మేసిన చరిత్ర ఈ చంద్రబాబుది. రాజమండ్రి, పరుచూరు స్పిన్నింగ్‌ మిల్లులు కూడా మూతపడేలా చేసి అమ్మేసిన చరిత్ర ఈ పెద్దమనిషిది. తన సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం చిత్తూరు జిల్లా డెయిరీని మూసివేయించిన పెద్ద మనిషి ఈ చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్షరాలా 54 ప్రభుత్వ కంపెనీలను శనక్కాయలకు, బెల్లానికి అమ్మేసినట్టుగా తన బినామీలకు, తన అనుచరులకు ఇష్టం వచ్చిన రేటుకు అమ్మేశాడు. ఇన్ని చేసినా ప్రజలకు ఏమీ తెలియదనుకుంటున్నట్టున్నాడేమో. లేక ప్రజల చెవుల్లో సులభంగా పూలు పెట్టవచ్చనుకుంటున్నాడేమో. 

చంద్రబాబు హయాంలో ఐటీ  రంగం వృద్ధి రేటు 8 శాతమైతే వైఎస్సార్‌  హయాంలో అది 14 శాతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఐటీకి 5వ స్థానం ఉంటే వైఎస్సార్‌ హయాంలో 3వ స్థానం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో 909 ఐటీ కంపెనీలు ఉంటే వైఎస్‌ హయాంలో మరో 1584 వచ్చాయి. మీ (చంద్రబాబు) హయాంలో ఐటీ ఉద్యోగాలు 85,945 అయితే వైఎస్‌ హయాంలో 2,64,375. చంద్రబాబు హయాంలో ఐటీ పెట్టుబడులు రూ.3,533 కోట్లయితే వైఎస్‌ హయాంలో 13,250 కోట్లు.ఇక ఎగుమతుల విషయంలో మీ హయాంలో రూ.5,025 కోట్లయితే వైఎస్‌ హయాంలో అవి రూ,33,482 కోట్లు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే చంద్రబాబు హయాంలో  ఎప్పుడూ మేళ్లు జరగవు. 

మన ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ -  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ 
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెం కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో గురువారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొత్త ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి అంతకంటే లేదని మండిపడ్డారు. ‘ఎన్నికలకు ముందు.. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఉద్యోగమో, ఉపాధో చూపించకపోతే ఇలా ఇలా రెండు వేళ్లు చూపించి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. చంద్రబాబు శ్రీకాకుళం వస్తే.. అయ్యా, ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి 55 నెలలు అయింది. ఈ లెక్కన ప్రతి ఇంటికీ మీరు లక్షా పది వేల రూపాయలు బాకీ పడ్డారు.. అవి ఎప్పుడిస్తారని నిలదీయండి. అప్పుడన్నా ఈ మనిషికి బుద్ధి వస్తుందేమో. ఉద్యోగాలు లేక మన పిల్లలు ఇబ్బంది పడుతుంటే  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయేమోనని మన పిల్లలందరూ కోచింగ్‌లకు పోతూ వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు.

నాలుగున్నరేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో ఆ పిల్లలందరూ ఇవాళ ఏమంటున్నారంటే.. జాబు రావాలి అంటే బాబు పోవాలి అంటున్నారు. ఈ పెద్దమనిషి హయాంలో టీచర్ల నియామకానికి డీఎస్సీ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారు. 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయాలంటే వాటిని భర్తీ చేయాలి. మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అంటే టీచర్‌ పోస్టుల్ని భర్తీ చేయాలి అనే ఆలోచన చేయాల్సిన ఈ పెద్ద మనిషి ఆ 23 వేల పోస్టులను కుదించి 7,900 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తాడు. మళ్లీ షెడ్యూల్‌ మార్చేస్తాడు.. సిలబస్‌ మార్చేస్తాడు. దీంతో టీచర్లు కావాలనుకున్న పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారందరికీ నేను హామీ ఇస్తున్నా. రేపు దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ పెడతానని ప్రతి పిల్లాడికి హామీ ఇస్తున్నా. ఇవాళ కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నాడు ఈ పెద్దమనిషి. సాక్షర భారత్‌లో 30 వేల మంది కేవలం రెండు వేల రూపాయల వేతనానికి పని చేస్తున్నారు. వాటిని ఎలా పెంచాలి అని ఆలోచించడానికి బదులు వారికి 12 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. గోపాలమిత్రలు రోడ్డు మీదకు వచ్చారు. సుమారు 85 వేల మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు రోడ్డు మీదకు వచ్చారు. వాళ్లకు నెలనెలా ఇచ్చేది వెయ్యి రూపాయలు. వీళ్లు భోజనం వండి పెడితే ఆ పిల్లలు బాగుపడతారు. కానీ ఈ చంద్రబాబు ఏమి చేస్తున్నాడో తెలుసా? గవర్నమెంటు స్కూళ్లకు పిల్లలు పోకూడదు అనే ఉద్దేశంతో స్కూలు పిల్లలకు వండిపెట్టేందుకు ఉద్దేశించిన సరుకుల బిల్లులు ఆరు నెలలుగా పెండింగ్‌ పెట్టారు. ఆ అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయిలు కూడా ఆరు నెలలుగా పెండింగ్‌ పెడితే వాళ్లు ఆ పిల్లలకు ఏమి వండి పెడతారు? ఆయుష్‌ ఉద్యోగస్తులు, గోపాల మిత్రులు, ఆదర్శ రైతులు రోడ్డు మీదకు వచ్చారు. అంగన్‌ వాడీలు, వీఏఓలు, సెకండ్‌ ఏఎన్‌ఎంలు, కాంట్రాక్ట్‌ టీచర్లు, ఉద్యోగులు.. ఇలా అందరూ భయం, భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందోనన్న భయంతో బతుకుతున్నారు. మన ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితిని మారుస్తాం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement