సాక్షి, హైదరాబాద్: ఆయా రాష్ట్రాలు తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి జాతీయ పార్టీలపై ఆధారపడటం కన్నా ప్రాంతీయ పార్టీలే జాతీయస్థాయిలో ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలన్న అభిప్రాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ–టీఆర్‌ఎస్ నేతల మధ్య జరిగిన చర్చల్లో వెల్లడైట్లు విశ్వసనీయంగా తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల తరువాత ఏర్పడబోయే జాతీయ రాజకీయ ముఖచిత్రం మాట ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు నుంచే భావసారూప్యత గల పార్టీలతో ఒక గట్టి లాబీ ఏర్పడితే అప్పటి పరిస్థితులను ప్రభావితం చేయవచ్చనే అంశం బుధవారం నేతల మధ్య చర్చకు వచ్చింది. ప్రస్తుత పరిణామాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో ఏర్పడబోయే ఫ్రంట్‌లతో ముందుగానే జత కడితే.. రేపు ప్రాధాన్యత లేని భాగస్వాములుగా ప్రాంతీయ పార్టీలు కొనసాగాల్సిందే తప్ప రాష్ట్రాల హక్కులను కాపాడుకునే పరిస్థితి ఉండదని నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. జాతీయ పార్టీల నేతృత్వంలోని ఫ్రంట్‌లలో తోక పార్టీలుగా మిగిలిపోవడం కంటే ప్రాంతీయ పార్టీలే శాసించే దశకు చేరుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందనే భావన ఇరు పార్టీల్లో వ్యక్తమైంది.
కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయి
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని ఫ్రంట్‌లు తప్ప మరో ప్రత్యమ్నాయ వేదిక లేదనే అభిప్రాయం తొలగించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరింత ముందుకు తీసుకువెళతారని, అందుకు సహకరించాలని టీఆర్‌ఎస్ నేతలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు సమాచారం. తమకు ప్రత్యేక హోదా అంశమే ప్రధానమైనదని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. కేంద్రం వద్దనే విస్తృతాధికారాలు ఉన్నందున ఆయా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఏమీ సాధించుకోలేని పరిస్థితి ఉందని, దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని టీఆర్‌ఎస్ భావిస్తుండగా... విభజనతో దారుణంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ప్రధాన లక్ష్యం అనే ప్రాతిపదికన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాలోచనలు జరిపారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ దారుణంగా మోసగించాయని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పేర్కొన్నారు.
మరిన్ని ప్రాంతీయ పార్టీలు మూడో ఫ్రంట్ వైపు ఆకర్షితులవుతాయనే అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వెల్లడైనట్లు తెలిసింది. మొత్తం మీద ఇవి ప్రాథమిక చర్చలేనని, తదుపరి జరిగే చర్చల్లో మరింత స్పష్టత వస్తుందని బుధవారం చర్చల్లో పాల్గొన్న నేత ఒకరు తెలిపారు.
చంద్రబాబుకు ఉలుకెందుకు?: సజ్జల
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం.. టీఆర్‌ఎస్ చొరవ మేరకు తమ పార్టీ స్పందించి చర్చలు జరిపితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ రాజకీయ పొత్తు కోసం రాలేదని, అసలు వారికి ఏపీలో ఆసక్తి కూడా లేదని అన్నారు. కేటీఆర్–జగన్ కలయికపై చంద్రబాబు ప్రేరణతో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం, టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ గట్టిగా కోరుతున్న ప్రత్యేక హోదాకు మద్దతు నిచ్చిన టీఆర్‌ఎస్‌ను స్వాగతించడంలో ఏమాత్రం తప్పు లేదని తెలిపారు. వాస్తవానికి నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం టీఆర్‌ఎస్ మద్దతు తీసుకుని ఎందుకు పోరాడలేదని నిలదీశారు. చంద్రబాబు చేయలేకపోయిన పనిని తాము చేస్తూంటే అంత అక్కసుగా ఉందా? అని సజ్జల మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment