సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ నిర్వహించిన ముఖాముఖిలో వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే.. వారికి మద్దతు ఇస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలలో తమది తటస్థ వైఖరి అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహించిన కాంక్లేవ్ – 2019లో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో నిర్ణయించడంలో డెక్కన్ ప్రాంత పాత్ర’ అన్న అంశంపై సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ నిర్వహించిన ముఖాముఖిలో వైఎస్ జగన్ పలు అంశాలపై స్పష్టంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని, చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిపోయారని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ–కాంగ్రెస్ పార్టీల పొత్తును ఉదహరిస్తూ పేర్కొన్నారు. తాను చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించిందని జగన్ అన్నారు. ‘‘14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది.’’ అని ఆయన తెలిపారు. నా తండ్రి పాలనను చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకున్నారని, ఆయన కొడుకుగా పుట్టినందుకు గర్విస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ పెట్టినవి రాజకీయ కక్షసాధింపు కేసులేనని పేర్కొంటూ తొమ్మిదేళ్లుగా ప్రజలు తన వ్యక్తిత్వాన్ని చూస్తున్నారని, తానేమిటో వారికి తెలుసునని జగన్ వివరించారు. ముఖాముఖి ఇలా సాగింది..
ప్రశ్న: సమకాలీన భారత రాజకీయాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం.. వెల్‌కమ్ సర్.. మీరు అత్యంత ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు. 3,648 కి.మీ.ల పాదయాత్ర చేశారు. అది నిజంగా మీకు చాలా ఉపయోగపడింది. (సభికులతో..) వాస్తవానికి జగన్‌మోహన్‌రెడ్డి ఈ పాదయాత్ర లో అత్యంత శక్తిమంతుడిగా కనిపించారు. ఆయన పాదయాత్ర గురించి వినని వారికి ఇది చెప్పాలి. తెల్లవారుజామున ఆయన లేచినప్పటి నుంచి రాత్రి చివరి గంట వరకూ ప్రజలతో మమేకమయ్యారు. కోర్టు కేసులో హాజరవ్వాల్సి ఉంటే అది కూడా చేసి తిరిగి మళ్లీ పాదయాత్ర ప్రాంతానికి చేరుకునేవారు. నిజంగా దృఢ సంకల్పాన్ని చూపారు. మీ అంత దూరం ఎవరూ నడవలేదని ప్రజలు చెబుతున్నారు. మీ తండ్రి చేసిన పాదయాత్ర ఆయన అధికారం సాధించడానికి మార్గం అయింది. మీ పాదయాత్ర మీరు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడానికి మార్గం అవుతుందా?
జగన్: ఇది అధికారానికి మార్గం అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కానీ పాదయాత్ర ప్రజలకు ఒక విశ్వాసం కల్పించింది. ప్రజలను అర్థం చేసుకోవడం, వారు చెప్పేది వినడం, వారి పరిస్థితి తెలుసుకోవడం, పాదయాత్రలో ఆద్యంతం వారి సమస్యలపై గళం వినిపించాం. తద్వారా ప్రభుత్వం ఆయా సమస్యలను పరిష్కరించేలా చేశాం. తమ సమస్యలను వినేందుకు ఒకరు ఉన్నారు.. ఏదైనా చేసేందుకు అండగా వస్తున్నారు.. అంటే అది ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకమే నన్ను కూడా ముందుకు నడిపిస్తుంది. నడిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలన్న నా కలలో ఒక ఉద్దేశం ఉంది. నేను చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉండాలన్నది నా కల. అది నా లక్ష్యం. నేను ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నా. ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. 14 నెలలు ప్రజల మధ్య నడిచాను. పగలూ రాత్రి వారు పడ్డ కష్టాలను చూశాను. ఆ కాలమంతా నన్ను వైవిధ్యంగా మలిచింది. ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనను కలిగించింది.
ప్రశ్న: మీ తండ్రి అకాల మరణం తర్వాత మీరు 2014 ఎన్నికల్లో తలపడ్డారు. ఆ తర్వాత మీ రాజకీయ పరిణామ క్రమాన్ని చెప్పండి..
జగన్: నా తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో ఎక్కువ సమయం ప్రజల మధ్యే గడిపాను. పాదయాత్రకు ముందు కూడా ప్రజల మధ్యే ఉన్నాను. ఈ పాదయాత్ర నిత్యం వారితోనే ఉండే అవకాశాన్ని కల్పించింది. పాదయాత్రలో నేను ఎక్కడ బస చేశానో తెలుసు. ఏ దారి వెంట నడిచానో తెలుసు. దీంతో నన్ను ఎక్కడ కలవాలో ప్రజలకు తెలిసిపోయేది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. సూక్ష్మ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రతిరోజూ విన్నాను. వారి దయనీయ పరిస్థితిని మార్చాలన్నదే నా సంకల్పం.
ప్రశ్న: రానున్న ఎన్నికల్లో మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే అవకాశం వస్తే పాలన ఎలా ఉండబోతోంది? ఎందుకంటే అన్ని ఒపీనియన్ పోల్స్ ప్రస్తుతం ఏపీలో మీరు ముందంజలో ఉన్నారని చెబుతున్నాయి. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో గట్టి వ్యతిరేకత కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనకు ఏరకంగా వైవిధ్యంగా ఉంటుంది?
జగన్: చాలా వరకు నేను చూసిన సమస్యల్లో అనేకం మానవ తప్పిదాలే. సరైన పాలన, విశ్వసనీయమైన పాలన వీటిలో అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. అమలు చేయలేని హామీలను మనం ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతను కోల్పోయారు. ఆయన అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈయన అబద్ధాల కారణంగా ప్రజలు ఈరోజు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఉదాహరణకు రైతుల విషయమే చూద్దాం. రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా ఆమేరకు సామర్థ్యం కలిగి ఉండదని ఆయనకు తెలిసి కూడా హామీ ఇచ్చారు. రుణాలు కట్టొద్దని చెప్పారు. రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. గద్దెనెక్కాక ఆ హామీని నిలబెట్టుకోకపోవడమే కాకుండా.. అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చే వడ్డీ రాయితీ వెసులుబాటును (వడ్డీ లేని రుణాలు) కూడా రైతులు పొందకుండా చేశారు. ఈ ఘనత చంద్రబాబు పాలనకే దక్కింది. గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. మిగిలిన అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదంతా చెప్పాలంటే సమయం సరిపోదు.
ప్రశ్న: నేను అడిగింది మీరు చెప్పలేదు.. మీరు చంద్రబాబు హయాంలో ఉన్న సమస్యల గురించి చెప్పారు. మీరు అధికారంలోకి వస్తే ఏరకమైన వైవిధ్యాన్ని చూపుతారు? మీ తండ్రి గారి సంక్షేమ పాలనకు పొడిగింపుగా ఉంటుందా? జగన్ ముఖ్యమంత్రి అయితే ఎలా పాలిస్తారు?
జగన్: ప్రస్తుతం సంతృప్త స్థాయిలో సేవలు అందడం లేదు. మీరు ఏ పార్టీ అంటూ లబ్ధిదారుల ను అడుగుతున్నారు. ప్రతి చోటా వివక్షే. అందుకే గ్రామ స్థాయి పరిపాలనలో భారీ మార్పులు తీసుకొస్తాం. గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అన్ని సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం లభిస్తుంది.
ప్రశ్న: జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ప్రధాన మంత్రి మోదీతో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మీ సమీకరణాలు ఎలా ఉన్నాయి?
జగన్: ఆ రోజు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ.. అందరూ సభ సాక్షిగా ఒక్కటయ్యారు. పార్లమెంట్ తలుపులు మూసేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. విభజనను అడ్డుకున్న సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీలు ఒక్కటయ్యాయి. విభజన కోరుకున్న రాష్ట్రం రాజధానిని తీసుకోవడం ఈ ఒక్క విభజనలోనే జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర విద్యార్థులు పట్టభద్రులైతే ఉద్యోగానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది.
ప్రశ్న: ప్రత్యేక హోదా ఈశాన్య రాష్ట్రాలకో లేక ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందంటే దానిని మనం అర్థం చేసుకోగలం. కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాదు కదా?
జగన్: రాష్ట్ర విభజన జరిగిన రోజు ఈ విషయాలు వాళ్లకు తెలియవా? ఆ రోజు జార్ఖండ్ వెనుకబడి లేదా? విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా రూపంలో పరిహారం ఇస్తామని పార్లమెంట్‌లో అధికార కాంగ్రెస్‌తో పాటు, ప్రతిపక్ష బీజేపీ కలిసి చెప్పాయి. కానీ ఇవాళ మాట నిలబెట్టుకోకుండా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి కాబట్టి హోదా ఇవ్వలేమంటున్నారు. మరి పార్లమెంటులో మాట ఎందుకు ఇచ్చినట్టు? అలా చేస్తే పార్లమెంట్‌పై విశ్వసనీయత ఎలా ఉంటుంది?
ప్రశ్న: 2019ఎన్నికల్లో మోదీ, అమిత్‌షా నేతృత్వంలోని బీజేపీ ఒకవైపు.. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలతో కూడిన మహా కూటమి మరో వైపు ఉంది. థర్డ్ ఫ్రంట్ లాంటిదొకటి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఎటు వైపు ఉండబోతున్నారు?
జగన్: మేము ఇప్పటికే తటస్థంగా ఉన్నాము. మా డిమాండ్ ప్రత్యేక హోదా ఒక్కటే. జగన్ అయినా, ఏపీ ప్రజలైనా ‘ఢిల్లీ’మాటలు నమ్మి మోసపోయాం. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన వారు మరచిపోయారు. ఇవన్నీ చూసి విసుగెత్తిపోయాం. ఏపీ ప్రజలు గానీ, ఏపీ ప్రజల ప్రతినిధిగా జగన్ గానీ.. మేం ఎవరినీ నమ్మాలనుకోవడం లేదు. మేం ఓపెన్‌గా ఉన్నాం. హోదా ఇచ్చిన వాళ్లకే మద్దతు ఇస్తామని చెప్పాం. మేం ఇప్పటికే ఐదేళ్లు కోల్పోయాం.
ప్రశ్న: అంటే మీరు పూర్తి పారదర్శకంగా ఉన్నామంటున్నారు. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే మీ మద్దతని అంటున్నారు. అది మోదీ కావొచ్చు.. రాహుల్ గాంధీ కావొచ్చు.. మాయావతి కావొచ్చు.. మీకు వ్యత్యాసం లేదు..
జగన్: కచ్చితంగా.. ప్రధాని ఎవరన్నది మాకు అనవసరం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తాం. మీరు (జర్నలిస్ట్ రాహుల్) ప్రధాని అయినా మద్దతు ఇస్తాం.
ప్రశ్న: నేను ప్రధాన మంత్రి కావాలనుకోవడం లేదు. మీరు ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్లతోనే వెళతామంటున్నారు. మీకు లోక్‌సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అత్యధిక సీట్లు గెలవాలని ఆశిస్తున్నారు. ఎవరికి అవసరమైతే వాళ్లతో వెళ్లాలనుకుంటున్నారు. కానీ దానికి పూర్తి మెజారిటీ లేని పార్టీ అధికారంలోకి రావాలి. అంటే మీరు బలమైన సర్కారు కావాలని కోరుకోవడం లేదు..
జగన్: పార్లమెంట్‌లో ఇచ్చిన మాటకు విలువ ఉండాలి. ఆ మాటకు పాలకులు కట్టుబడి ఉండాలి. విభజనతో ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలి. దీనిని నేతలు అర్థం చేసుకోవాలన్నదే నా అభిమతం.
ప్రశ్న: మీ తండ్రి మరణానంతరం సోనియా గాంధీ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయకపోవడంతో మీరు కాంగ్రెస్‌ను వదిలివెళ్లి సొంత పార్టీ పెట్టుకున్నారని అంటారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ మిమ్మల్ని తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తే, కలిసి పని చేద్దామంటే ఏమంటారు?
జగన్: మాకు ఏది అవసరమో చాలా స్పష్టంగా చెప్పాను. నేను రాహుల్ గాంధీకో, మరొకరికో వ్యతిరేకం కాదు. మా లక్ష్యం చాలా సూటిగా ఉంది. మేం ఎవరినీ నమ్మదలుచుకోలేదు. ఇప్పటికే ఐదేళ్లు నష్టపోయాం. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మేం మద్దతు ఇస్తాం. అంతే సింపుల్. మా ఆప్షన్లన్నీ ఓపెన్‌గా పెట్టుకున్నాం. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదు.
ప్రశ్న: గతంలో మీనాన్న గారు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. ఆ విధంగానే మీరు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళతారా?
జగన్: అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది? మాకు కాంగ్రెస్‌తో ఏం పని? బహుశా వాళ్లకే మా అవసరం ఉండొచ్చు.
ప్రశ్న: పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌కు 2014లో 2.94% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కొంత మెరుగుపడినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. మీరు ఏమనుకుంటున్నారు?
జగన్: కాంగ్రెస్‌కు దానిపై దానికే నమ్మకం లేదు. వారికి విశ్వాసం ఉంటే వారు టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. 30 ఏళ్లు కాంగ్రెస్‌పై పోరాడిన టీడీపీతో వారు పొత్తు పెట్టుకున్నారు. ఎలాంటి నైతిక విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడి అవినీతిపై 2018 జూన్ 8న కాంగ్రెస్ ‘అత్యంత అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు’అనే పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసింది. దానిపై రాహుల్ గాంధీ బొమ్మ కూడా ప్రచురించింది. ఇది విడుదల చేసిన మూడు నెలల్లోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోయి ఎన్నికల్లో పోటీ చేశాయి. ప్రజలు ఏమనుకుంటారన్న స్పృహ కూడా వారికి లేదు. ప్రజలను ఫూల్స్ చేద్దామనుకున్నారా? ఇలాంటి వాళ్లను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు.
ప్రశ్న: మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆరోపణలు, ఇందుకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావా?
జగన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతున్నప్పుడు కేసులు పెట్టడం చాలా సులభం. ఈ కేసులన్నీ మా నాన్న చనిపోయాక, నేను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు వచ్చినవే. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఈ కేసులు పెట్టారు. కానీ వాస్తవం ఏంటంటే ఇవన్నీ రాజకీయ కేసులు. కానీ ప్రజలు నా వ్యక్తిత్వాన్ని చూశారు. నేనేంటో వారికి తెలుసు.
ప్రశ్న: రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీల్లో ఎవరు తక్కువ చెడు చేసేవారు..
జగన్: వీరిద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు.
ప్రశ్న: చంద్రబాబు నాయుడు అమరావతిలో కొత్త రాజధాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే అక్కడే దానిని కొనసాగిస్తారా? లేక మరో చోట నిర్మిస్తారా?
జగన్: ఇది క్యాచ్ – 22 పరిస్థితి (వైరుధ్య పరిస్థితులు ఉన్నా కొనసాగించాల్సిన పరిస్థితి). ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం. చంద్రబాబు 2014 జూన్‌లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసు. కానీ అక్కడ, ఇక్కడ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. సరిగ్గా రాజధాని ఏర్పాటయ్యే చోట సొంత హెరిటేజ్ కంపెనీ పేరుతో, బినామీల పేరుతో అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.
ప్రశ్న: మీది పెద్ద రాష్ట్రం. పారిశ్రామిక రాష్ట్రం. వాణిజ్య సంస్థలు ఉన్నాయి. మీకున్న వనరులతో బాగా చేయొచ్చు కదా? ఎందుకు మీరు ప్రత్యేక హోదా కోసం అంతగా డిమాండ్ చేస్తున్నారు?
జగన్: మాకు ఎందుకు హోదా ముఖ్యమంటే.. హైదరాబాద్‌తోగానీ, చెన్నైతోగానీ, బెంగళూరుతో గానీ పోటీ పడే వనరులు లేవు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టింది. ఈరోజు ఒక పట్టభద్రుడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు. హోదా వస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు వస్తాయి. 100 శాతం ఆదాయపు పన్ను రాయితీ, వంద శాతం జీఎస్టీ రాయితీ లభిస్తుంది. ఇలాంటి పారిశ్రామిక ప్రత్యేక ప్రోత్సాహకాలతోనే ఎవరైనా ముందుకొచ్చి హోటలో, ఆసుపత్రో, ఐటీ సంస్థనో, కర్మాగారమో ఏర్పాటు చేస్తారు. పక్కనే హైదరాబాద్ ఉంది. అక్కడ అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. ఇప్పుడు మాకంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అత్యంత ముందంజలో ఉండగా ఎవరైనా ఏపీకి వచ్చి ఎందుకు పెట్టుబడులు పెడతారు?
ప్రశ్న: మీరు విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. మీ నాన్నలా ప్రజలతో మమేకమయ్యా రు. ఇది అతికొద్ది మంది మాత్రమే చేయగలరు. మీరు ముందంజలో ఉన్నారని, ఏపీలో మీదే విజయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. కానీ మీ 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మీరు 15 కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. ఇవి ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి?
జగన్: మీకు వాటి నేపథ్యం చెబుతాను. మా నాన్న బతికి ఉన్నప్పుడు నాపై కేసులు లేవు. అవి ఎప్పుడు వచ్చాయంటే నేను కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్లాలనుకున్నప్పుడు. పిటిషనర్లు ఎవరు? టీడీపీ, కాంగ్రెస్ నేతలు. ఇద్దరూ ఒక్కటై నా తండ్రి మరణానంతరం, నేను కాంగ్రెస్‌ను వీడాక ఇద్దరూ ఒక్కటై కేసులు ఫైల్ చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. మా నాన్న పాల న చూశాకే 2009లో రెండోసారి ముఖ్యమంత్రిని చేశారు. నాడు మా నాన్న నాయకత్వంలో ఏపీ నుంచి 33మంది ఎంపీలు గెలిచారు కాబట్టి యూపీ ఏ ప్రభుత్వం ఏర్పాటైంది. నేనప్పుడు రాజకీయాల్లోనే లేను. కనీసం హైదరాబాద్‌లో కూడా లేను.
ప్రశ్న: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి, ఇరు దేశాల సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు రాష్ట్రంలో ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపుతాయా?
జగన్: బహుశా ఈ విషయంలో మోదీకి కొంత మైలేజీ వచ్చి ఉండొచ్చు. ఈ విషయంలో నేను ఆయనకు క్రెడిట్ ఇస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో హోదా పట్ల మాట తప్పారు.
ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్‌కు దూరం చేశారు. అందువల్ల అక్కడ ఆయన్ను ప్రజలు ఆదరించరు.
ప్రశ్న: మీరు చంద్రబాబును జైలుకు పంపదలుచుకున్నారా?
జగన్: ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే ఓత్ ఆఫ్ సీక్రెసీని ఉల్లంఘించడమే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను, రహస్యాలను కాపాడతానని, గోప్యం పాటిస్తానని ప్రమాణం చేస్తారు. కానీ చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాల కోసం వాటిని భంగపరిచారు. తన కంపెనీ హెరిటేజ్ పేరుతో భూములు కొన్నారు. బినామీల పేరుతో కొన్నారు. అక్కడితో ఆగలేదు. ఆయన, ఆయన బినామీలు ఏమంటారంటే రాజధానికి భూములే సేకరించలేదని చెబుతారు. భూ సమీకరణ పేరుతో భూములు సేకరించారు. అలా సేకరించిన భూములను వారికి ఇష్టమొచ్చిన వారికి, వారికి ఇష్టమొచ్చిన ధరలకు ఇచ్చారు. 1600 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చేశారు. చివరలో ఒక్క మాట.. తెలంగాణలో ఎమ్మెల్యేలను తన బ్లాక్ మనీతో కొంటూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇలాంటి నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? ఆ టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతే అని ఫోరెన్సిక్ పరీక్షలో కూడా తేలింది. అయినా ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు. ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాబట్టి వాస్తవం ఏమిటన్నది మేధావులంతా ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment