సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమర శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి నడిగట్ల చింతలరావు అనే నాయకుడు ‘అన్ని పార్టీలు కలిసి మన రాష్ట్రానికి అన్యాయం చేసాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. ఈ మోసాలను ఎలా ఎదుర్కొవాలి’ అని వైఎస్ జగన్‌ను అడిగారు. దీనిపై వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను గమనించాల్సిందిగా, ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్పండి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు విన్నాం... ఆ తర్వాత చేసిన మోసం చూశాం. మళ్లీ ఎన్నికల వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి.
ఒక ప్రత్యేక హోదా అంశాన్నే తీసుకుంటే.. ఎన్నికల ముందు ప్రతేక హోదాపై ఉదరగొట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు అడగలేదు. ఇప్పుడు ఎన్నికలచ్చేసరికి మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. మనం వద్దనుకున్నా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి తీరని అన్యాయం చేసింది. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చలేదు. అలా చేర్చుంటే కోర్టు ద్వారానైనా మనం హోదాను సాధించేవాళ్ళం. ఇచ్చే అవకాశం ఉన్న బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండి. పవన్ కల్యాణ్ గురించి కూడా ప్రజలకు చెప్పండి. చంద్రబాబుకు ఓటేయ్యండి, బీజేపీకి ఓటేయ్యండని చెప్పిన పవన్ కల్యాణ్.. నాలుగేళ్లు వాళ్లతో కలిసి ప్రయాణించి.. మళ్లీ ఎన్నికలచ్చే సరికి కారణాలు చెబుతారు. చంపేటప్పుడు వీళ్లు ముగ్గురు భాగస్వామ్యులు. ఒకరు కత్తి ఇచ్చారు. ఒకరు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మరోకరు కత్తి తీసుకుని ఆ వ్యక్తిని పొడిచారు. ఇలా ముగ్గురు కలిసి ప్రత్యేక హోదాను హత్య చేశారు. వాళ్లను నమ్మి నమ్మి మోసపోయాం. ఇకా ఎవరినీ నమ్మవద్దని చెప్పండి. 25కు 25 ఎంపీ సీట్లు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో గట్టిగా చుద్దామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment